ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం యూసీసీ బిల్లును ప్రవేశపెట్టారు. ఇటీవలే యూసీసీ బిల్లును ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లు అసెంబ్లీలో పాస్ అయితే.. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలందరికీ యూసీసీ నిబంధనలు వర్తించనున్నాయి. ఆ చట్టాలకు మతపరమైన అధికారాలు ఉండవు. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత లాంటి వ్యక్తిగత విషయాల అంశంలో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు కీలకం కానున్నది. ఈ బిల్లును సీఎం అసెంబ్లీలో ప్రవేశపెట్టే సమయంలో జై శ్రీరాం, వందే మాతరం వంటి నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది.
ఉమ్మడి పౌరస్మృతి బిల్లు అమల్లోకి వస్తే.. సహజీవనంలో ఉండాలనుకునే వారు, ఇప్పటికే ఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఎవరైతే ఈ చట్టం నిబంధనలను పాటించరో వారికి ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో రూ. 25 వేలు జరిమానా విధించనున్నారు. యూసీసీ బిల్లు ప్రకారం.. 21 ఏండ్ల లోపు పిల్లలు సహజీవనం చేయాలనుకుంటే తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరిగా పొంది ఉండాలి. దాంతో పాటు ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
యూసీసీ ప్రకారం.. సహజీవనంలో ఉండి విడిపోతే బాధితురాలు కోర్టును ఆశ్రయించొచ్చు. మెయింటెనెన్స్ కూడా చేసుకునేందుకు ఆమె అర్హురాలిగా బిల్లులో పేర్కొన్నారు. లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న బిడ్డ జన్మిస్తే.. అతని చట్టబద్దమైన బిడ్డగా ప్రకటిస్తారు. సహజీవనం వద్దనుకున్నప్పుడు కూడా తప్పనిసరిగా వారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి. ఒకవేళ ఈ బిల్లు అసెంబ్లీలో పాసైతే స్వాతంత్య్రం తర్వాత ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలువనున్నది. అయితే ఇదే చట్టాన్ని అమలు చేయడానికి బీజేపీ పాలిత రాష్ట్రాలైన అస్సాం, మధ్యప్రదేశ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పోర్చుగీసు పాలనలో ఉన్న గోవాలో కూడా ఇలాంటి సివిల్ కోడ్ రూల్ చాన్నాళ్లుగా అమలులో ఉన్నది.