వాట్సప్ కొత్తగా మరో ఫీచర్ తీసుకొచ్చింది. మెసేజింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తూ వాయిస్ ట్రాన్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో మనకొచ్చే వాయిస్ మెసేజ్ టెక్ట్స్ రూపంలో కనిపిస్తుంది. ఆడియో సందేశం వినలేని సందర్భాల్లో, అవతలి వ్యక్తి పంపించిన సందేశాన్ని టెక్ట్స్ రూపంలో రాసుకోవాల్సిన సందర్భంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
ప్రస్తుతానికి ఇంగ్లిష్, హిందీతో పాటు స్పానిష్, పోర్చుగీసు, రష్యన్ భాషలకు కొత్త ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ యాక్టివేట్ చేయడానికి వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి చాట్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చుంటే ట్రాన్‌స్క్రిప్షన్ ఆఫ్/ ఆన్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకసారి యాక్టివేట్ చేసుకున్నాక వచ్చిన వాయిస్‌నోట్స్‌ను అక్షర రూపంలోకి మార్చుకోవడానికి దాని కిందే ఓ ఆప్షన్ కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో కొందరికి ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా.. త్వరలో అందరూ వినియోగించడానికి వీలవుతుంది. వాట్సప్ వెబ్ వెర్షన్‌లో ఈ ఆప్షన్ కనిపించదు.