Sunday, November 10, 2024
Homeఅంతర్జాతీయం'డివోర్స్‌' పేరిట ఒక కొత్త పెర్‌ఫ్యూమ్‌

‘డివోర్స్‌’ పేరిట ఒక కొత్త పెర్‌ఫ్యూమ్‌

Date:

దుబాయి యువ‌రాణి విడాకుల ప్రకటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా మరో పోస్టు చేశారు. సొంత బ్రాండ్‌ కింద పెర్ఫ్యూమ్‌ను ఆవిష్కరించారు. దానికి ఆమె పెట్టిన పేరు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే..? తాను ‘డివోర్స్‌’ పేరిట ఒక కొత్త పెర్‌ఫ్యూమ్‌ను తీసుకొస్తున్నట్లు యువరాణి షేక్ మహ్రా ఇన్‌స్టాగ్రాం వేదికగా ప్రకటించారు. సొంత బ్రాండ్‌ ‘మహ్రా ఎమ్‌1’ కింద దానిని త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఆ దృశ్యాలను షేర్ చేశారు. అయితే పెర్‌ఫ్యూమ్ విలువ ఎంతో తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే.. ఆమె కొన్ని నెలల క్రితమే తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

దుబాయ్‌ పాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ కుమార్తె షేక్‌ మహ్రా. బ్రిటన్‌లో ఉన్నతవిద్యను అభ్యసించిన ఆమె అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టా పొందారు. మహిళా సాధికారికతకు కృషి చేస్తున్నారు. దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్‌ మనాబిన్‌ మొహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌తో మే 27, 2023న వీరి వివాహం జరిగింది. ఏడాది తర్వాత.. తన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకమని పేర్కొంటూ భర్త, చిన్నారితో కూడిన ఫొటోలను మహ్రా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ‘మనమిద్దరం మాత్రమే’ అంటూ చిన్నారితో కూడిన మరో ఫొటోతో పోస్టు పెట్టడం చర్చనీయాంశమైంది. అనంతరం జులైలో విడాకుల ప్రకటన చేసి ఆశ్చర్యపర్చారు. ”’ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సహచర్యం కోరుకున్నందున మీతో విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకున్నా. ‘ఐ డివోర్స్‌ యూ’. టేక్‌ కేర్‌.. మీ మాజీ భార్య” అని అప్పుడు సోషల్‌ మీడియాలో వెల్లడించారు.