Tuesday, September 24, 2024
HomeUncategorizedసందేశ్‌ఖాలీ మహిళలతో మమతా భారీ ర్యాలీ

సందేశ్‌ఖాలీ మహిళలతో మమతా భారీ ర్యాలీ

Date:

బెంగాల్‌లోనే మహిళలు అత్యంత సురక్షితమని, దీనిని తాను నిరూపించగలనని పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ సవాల్‌ చేశారు. సందేశ్‌ఖాలీ మహిళలతో కలిసి కోల్‌కతాలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. టీఎంసీ నేతల లైంగిక దాడుల ఆరోపణలతో రగులుతున్న సందేశ్‌ఖాలీ దీవికి చెందిన మహిళలు కూడా ఇందులో పాల్గొన్నారు. ‘మహిళల హక్కులు, మా నిబద్ధత’ అన్న నినాదంతో సాగిన ఈ ర్యాలీలో బీజేపీతోపాటు ప్రధాని మోడీని మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్‌లో మహిళలను హింసిస్తున్నట్లు బీజేపీ నేతలు ఆరోపించడాన్ని ఖండించారు.

ప్రధాని మోడీ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయనపై మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించినప్పుడు, హత్రాస్‌లో ఒక మహిళపై అత్యాచారం చేసి, ఆమె మృతదేహాన్ని బలవంతంగా దహనం చేసినప్పుడు, ఆయన (మోదీ) ఎక్కడ ఉన్నారు?’ అని ప్రశ్నించారు. బిల్కిస్ (బానో)ను మీరు మరిచిపోయారా? అని నిలదీశారు. మరోవైపు కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్‌ గంగోపాధ్యాయ బీజేపీలో చేరడంపై మమతా బెనర్జీ స్పందించారు. ‘ఒక బీజేపీ బాబు గద్దె మీద కూర్చున్నాడు. ఆయన ఇప్పుడు బీజేపీలో చేరాడు. మీరు వారి నుంచి న్యాయం ఎలా ఆశిస్తారు?’ అని ఎద్దేవా చేశారు. కాగా, మార్చి 8న శివరాత్రితోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఒక రోజు ముందుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.