సోషల్ మీడియా విచ్చలవిడిగా పెరిగిపోతుంది.. చాలా మంది సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎక్కువ శాతం మంది ఫేమస్ అయ్యేందుకు రీల్స్ వాడుతున్నారు. రీల్స్ చేసే క్రమంలో ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. రీల్స్ సరదాతో కొందరు చేసే పనులు.. ఇతరులను కూడా ప్రమాదంలోకి నెడుతున్నాయి. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకొంది. సైకిల్‌పై వెళుతున్న వారి ముఖాలపై ఫోమ్ కొట్టిన ఓ యువకుడిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.
ఝాన్సీలో నిత్యం రద్దీగా ఉండే నవాబాద్ ప్రాంతంలోని రోడ్డుపై ఇద్దరు యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఆ రోడ్డులో ఓ వృద్ధుడు సైకిల్‌పై వెళుతున్నాడు. అదే సమయంలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు అతడి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ ఉంటే.. మరో యువకుడు ఆ వృద్ధుడి ముఖంపై వైట్ ఫోమ్‌ను స్ప్రే చేశాడు. మరికొంత దూరం వెళ్లాక మరో వ్యక్తితోనూ ఇదే విధంగా ప్రవర్తించారు. పైగా దీన్ని ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. యువకుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో వృద్ధుడితో ఇలా ప్రవర్తించడం సరికాదు. అతను కింద పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది” అని ఒకరు.. ”రీల్స్ కోసం ఇలాంటి అనాలోచిత చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి” అని మరొకరు.. ”రీల్స్ కోసం ప్రమాదక స్టంట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూసినా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు” అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. వైరల్‌గా మారిన ఈ వీడియో పోలీసుల దృష్టికి వచ్చింది. వెంటనే ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.