Thursday, September 26, 2024
HomeUncategorizedమహా కాలేశ్వర్‌ ఆలయంలో భారీ అగ్నిప్రమాదం

మహా కాలేశ్వర్‌ ఆలయంలో భారీ అగ్నిప్రమాదం

Date:

ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహా కాలేశ్వర్‌ ఆలయంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో 13 మంది గాయపడినట్లు తెలుస్తోంది. హోలీ పర్వదినం సందర్భంగా ప్రధాన గోపురం కింద ఉన్న గర్భగృహంలో భస్మహారతి కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకొంది.

ఆలయంలో స్వామికి గులాల్‌ను సమర్పిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ వస్త్రం వంటిది అంటుకొని పూజారులు, భక్తులపై పడింది. ఈ విషయాన్ని ఆలయ పూజారి ఆశీష్‌ కూడా ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది గాయపడటంతో వారిని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు కలెక్టర్‌ నీరజ్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఇందౌర్‌ తీసుకెళ్లారు. బాధితుల్లో ఆలయ ప్రధాన పూజారి సంజయ్‌ గౌర్‌ కూడా ఉన్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆలయంలో హోలీ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ కుమారుడు, కుమార్తె త్రుటిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో వారు ఉన్నారు.