Tuesday, October 15, 2024
Homeజాతీయం75, 80 ఏళ్ల వయస్సులో మీకు విడాకులు కావాలా

75, 80 ఏళ్ల వయస్సులో మీకు విడాకులు కావాలా

Date:

75, 80 ఏళ్ల వయస్సులో ఓ వృద్ధ జంట జీవితం చివరి దశలో విడాకులు కావాలంటూ కోర్టుకెక్కింది. అంతేకాకుండా తన భర్త నుంచి భరణం ఇప్పించాలంటూ ఆ వృద్ధురాలు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పును.. వృద్ధుడు హైకోర్టులో సవాల్ చేయడంతో కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన మునేష్ కుమార్ గుప్తా.. తన భార్య దాఖలు చేసిన విడాకులు, మనోవర్తి పిటిషన్‌పై ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టుకు ఎక్కాడు. అయితే వారి వయసు 75 నుంచి 80 ఏళ్ల మధ్యలో ఉండటం గమనార్హం. మొదట ఫ్యామిలో కోర్టుకు వెళ్లగా.. మునేష్ కుమార్ గుప్తా భార్యకు మద్దతుగా తీర్పు వెలువడింది. దీంతో అది నచ్చని మునేష్ కుమార్ గుప్తా.. ఫ్యామిలీ కోర్టు తీర్పును అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశాడు.

ఈ సందర్భంగా మునేష్ కుమార్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు.. సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి కేసులు చూస్తుంటే కలియుగం వచ్చేసినట్లే కనిపిస్తోంది అంటూ జడ్జి జస్టిస్ సౌరభ్ శ్యామ్ షంషేరీ పేర్కొన్నారు. మొదట ఈ కేసు గురించి విని జడ్జి ఆశ్చర్యపోగా.. ఈ వయసులో ఇదేం గొడవ అంటూ షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే విచారణను వాయిదా వేస్తున్నట్లు జడ్జి తెలిపారు. తదుపరి విచారణలోగా ఇద్దరు వృద్ధులు ఏదైనా మాట్లాడుకుని ఒప్పందం కుదుర్చుకునేందుకు ఒక అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.