Tuesday, September 24, 2024
HomeUncategorizedమరో వివాదంలో ఎయిరిండియా సంస్థ

మరో వివాదంలో ఎయిరిండియా సంస్థ

Date:

ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఎయిరిండియా సంస్థ మరో వివాదంలో పడింది. కేబిన్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన కారణంగా మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచి దించేసింది. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ” మార్చి 5వ తేదీ దిల్లీ నుంచి లండన్‌కు వెళుతున్న ఏఐ 161 విమానంలో ప్రముఖ కంపెనీలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న మహిళా ప్రయాణికురాలు బిజినెస్‌ క్లాస్‌లో టికెట్‌ కొనుగోలు చేశారు. విమానం టేకాఫ్‌ అవడానికి ముందు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో పైలట్‌ సూచన మేరకు ఆమెను దించేశాం. అయితే, హామీ పత్రం తీసుకున్న తర్వాత మరో విమానంలో పంపాం” అని ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జనవరి నెలలోనే సుమారు 894 మంది ప్రయాణికులను వివిధ కారణాలతో విమానాల్లో ప్రయాణించేందుకు ఎయిరిండియా నిరాకరించింది. దాంతోపాటు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, వసతి, పరిహారం కింద రూ.98 లక్షలు చెల్లించినట్లు తెలిపింది. గత నెలలో వీల్‌ఛైర్‌ సదుపాయం కల్పించకపోవడంతో ఓ వృద్ధుడు నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిపోయిన ఘటనలో ఎయిరిండియాకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.