Monday, September 23, 2024
HomeUncategorizedప్రజల వద్దే ఇంకా రూ.8,470 కోట్ల ₹2 వేల నోట్లు..!

ప్రజల వద్దే ఇంకా రూ.8,470 కోట్ల ₹2 వేల నోట్లు..!

Date:

దేశంలో రెండు వేల రూపాయల నోటును ఉపసంహరించుకుని తొమ్మిది నెలలు దాటినప్పటికీ.. ఇంకా రూ.8,470 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, చలామణీలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో 97.62శాతం తిరిగి బ్యాంకులకు చేరినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుక్రవారం వెల్లడించింది. రూ.2 వేల నోటు ఇప్పటికీ లీగల్‌ టెండర్‌గా కొనసాగుతుందని ఆర్‌బీఐ మరోసారి స్పష్టం చేసింది. ఈ నోటును కేంద్ర బ్యాంకు గతేడాది మే 19న ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వెలువడే నాటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. బ్యాంకుల్లో నోట్ల మార్పిడి/డిపాజిట్‌కు ప్రజలకు తొలుత సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం ఇచ్చారు. అనంతరం అక్టోబర్‌ 7 వరకు ఆ గడువును పొడిగించారు. ఆ తర్వాత నుంచి ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ నోట్లను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 29 నాటికి 97.62 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది.

ఆర్‌ఐబీ ప్రాంతీయ కార్యాలయాల వద్ద నోట్లను ఎక్స్ఛేంజీ/ డిపాజిట్‌ చేసుకోవచ్చని కేంద్ర బ్యాంక్‌ తెలిపింది. రీజనల్‌ ఆఫీసులకు చేరుకోలేనివారు పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ఆయా కార్యాలయాలకు వాటిని పంపించొచ్చని పేర్కొంది. హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, బేల్‌పుర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, ఛండీగడ్‌, చెన్నై, గువాహటి, జైపుర్‌, జమ్మూ, కాన్పుర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పుర్‌, దిల్లీ, పట్నా, తిరువనంతపురంలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.