Monday, September 23, 2024
HomeUncategorizedపిల్లల్లో భారీగా పెరుగుతున్న ఊబకాయం

పిల్లల్లో భారీగా పెరుగుతున్న ఊబకాయం

Date:

నేడు ప్రపంచవ్యాప్తంగా ఊబకాయ బాధితులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యు సమస్యలు.. కారణాలేమయితేనేం ఈ శతాబ్దంలో అధిక సంఖ్యాకులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య స్థూలకాయం. చిన్నా – పెద్దా అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతూ.. ఇతర జబ్బులకూ దారితీసి ప్రాణాంతకంగా కూడా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు, పెద్దలు, కౌమారదశలో ఉన్నవారు ఇలా మొత్తం 100 కోట్ల మందికి పైగా ఊబకాయంతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. 1990 నుంచి తక్కువ బరువు ఉన్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని, ఫలితంగా చాలా దేశాల్లో స్థూలకాయం అత్యంత సాధారణంగా మారిపోయిందని ‘ది లాన్సెట్ జర్నల్’ ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంది. ఇక భారత్‌లో 1990తో పోల్చితే ప్రస్తుతం పిల్లలు, యుక్తవయసువారిలో ఊబకాయం నాలుగు రెట్లు పెరిగిందని వెల్లడించింది.

ఐదేళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న 12.5 మిలియన్ల మంది చిన్నారుల్లో ఊబకాయం బాగా పెరిగిపోయిందని అధ్యయనం తెలిపింది. అధికంగా బాలురే ఊబకాయంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. 7.3 మిలియన్ల మంది బాలురు ఊబకాయ సమస్యతో సతమతమవుతుంటే.. 5.2 మిలియన్ల మంది బాలికలు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వివరించింది. ఎన్‌సీడీ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థల వద్ద అందుబాటులో ఉన్న గ్లోబల్ డేటా ఆధారంగా పరిశీలన చేసినట్లు అధ్యయనం వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద వయసు మహిళల్లో ఊబకాయం రెండింతలు, పురుషుల్లో దాదాపు 3 రెట్లు పెరిగిందని అధ్యయనం పేర్కొంది. 2022లో మొత్తం 159 మిలియన్ల మంది పిల్లలు, యుక్తవయస్కులు, 879 మిలియన్ల మంది పెద్దలు ఊబకాయంతో జీవిస్తున్నారని వివరించింది.