Friday, October 4, 2024
HomeUncategorizedపాకిస్థాన్‌తో పోలిస్తే ఇండియా వ‌ద్దే ఎక్కువ అణ్వాయుధాలు

పాకిస్థాన్‌తో పోలిస్తే ఇండియా వ‌ద్దే ఎక్కువ అణ్వాయుధాలు

Date:

ప్రపంచంలో అణ్వాయుధాలు ఉన్న దేశాల‌పై స్టాక్‌హోమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ పీస్ రీస‌ర్చ్ ఇన్స్‌టిట్యూట్(ఎస్ఐపీఆర్ఐ) కొత్త నివేదిక‌ను ప్రకటన చేసింది. అమెరికా, ర‌ష్యా, ఫ్రాన్స్‌, చైనా, ఇండియా, పాకిస్థాన్ లాంటి దేశాలు త‌మ అణ్వాయుధా సంప‌ద‌ను మ‌రింత ఆధునీక‌రిస్తున్న‌ట్లు ఆ రిపోర్టులో వెల్ల‌డించారు. గ‌త ఏడాది అణ్వాయుధ ఆధునీక‌ర‌ణ ఎక్కువ సంఖ్య‌లో జ‌రిగిన‌ట్లు స్వీడ‌న్ సంస్థ త‌న రిపోర్టులో తెలిపింది. 2023లో చైనా వ‌ద్ద 410 అణ్వాయుధాలు ఉన్నాయ‌ని, అయితే 2024 జ‌న‌వ‌రి నాటికి ఆ సంఖ్య 500 దాటిన‌ట్లు ఎస్ఐపీఆర్ఐ తెలిపింది. ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కూడా ఆ సంస్థ త‌న రిపోర్టులో వెల్ల‌డించింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 2100 అణ్వాయుధాలు.. బాలిస్టిక్ మిస్సైళ్ల ద్వారా వినియోగించేందుకు సంసిద్ధంగా ఉన్నాయ‌ని రిపోర్టులో తెలిపారు. దీంట్లో అమెరికా, ర‌ష్యా దేశాలు అగ్ర‌స్థానంలో ఉన్నాయి. అయితే చైనా ప్ర‌స్తుతం త‌న వార్‌హెడ్స్‌ను ఎక్కువ సంఖ్య‌లో సంసిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంద‌ని రిపోర్టులో వెల్ల‌డించారు. ఎస్ఐపీఆర్ఐ ప్ర‌కారం 9 దేశాలు మాత్రం త‌మ అణ్వాయుధాల‌ను ప్ర‌తి నిత్యం ఆధునీక‌రిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 12,121 వార్‌హెడ్స్ ఉన్నాయ‌ని, దాంట్లో మిలిట‌రీ వ‌ద్దే సుమారు 9,585 ఉన్న‌ట్లు రిపోర్టులో తెలిపారు.

ర‌ష్యా, ఫ్రాన్స్‌, బ్రిట‌న్‌, అమెరికా దేశాల త‌ర‌హాలోనే ప‌లుర‌కాల అణ్వాయుధాల‌ను వాడేందుకు ఇండియా, పాక్‌, నార్త్ కొరియా కూడా చూస్తున్న‌ట్లు ఎస్ఐపీఆర్ఐ తెలిపింది. అమెరికా, ర‌ష్యా వ‌ద్ద 90 శాతం అణ్వాయుధాలు ఉన్న‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. అయితే పాకిస్థాన్‌తో పోలిస్తే ఇండియా వ‌ద్దే ఎక్కువ సంఖ్య‌లో అణ్వాయుధాలు ఉన్న‌ట్లు తేలింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి నాటికి ఇండియా వ‌ద్ద 172 ఉండ‌గా, పాకిస్థాన్ వ‌ద్ద 170 అణ్వాయుధాలుఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. 2023లో ఇండియా త‌న సంఖ్య‌ను స్వ‌ల్పంగా పెంచుకున్న‌ట్లు రిపోర్టులో తెలిపారు. లాంగ్ రేంజ్ ఆయుధాల‌ను వృద్ధి చేయ‌డంలో ఇండియా ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోందని, అవి చైనాను టార్గెట్ చేసేలా త‌యారు చేస్తున్న‌ట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ర‌ష్యా, అమెరికా వ‌ద్ద ఎన్ని ఐసీబీఎంలు ఉన్నాయో .. అదే సంఖ్య‌లో చైనా వ‌ద్ద కూడా ఆ ఆయుధాలు ఉండి ఉంటాయ‌ని రిపోర్టులో అంచనా వేశారు.