ప్రస్తుత సోషల్ మీడియా సమాజంలో యూట్యూబ్‌కు ఉన్న ప్రత్యేకతనే వేరు. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలామంది యూట్యూబ్ వినియోగిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ ఈ యూట్యూబ్‌లోని కంటెంట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంటెంట్ సృష్టికర్తలు, వీక్షకుల కోసం యూట్యూబ్ ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటుంది. కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కీలక ప్రకటన చేసింది.
కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. షార్ట్స్ వీడియోల నిడివిని పెంచింది. యూట్యూబ్‌లో నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకునే ఫీచర్లలో షార్ట్స్ వీడియోలు ఒకటి. ఇప్పటి వరకూ 60 సెకెన్ల వరకూ ఉన్న షార్ట్స్ మాత్రమే అప్‌లోడ్ చేసుకునే వీలుండేది. అయితే, ఈ నిడివిని 3 నిమిషాల వరకూ పెంచుతూ యూట్యూబ్ నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.