Tuesday, September 24, 2024
HomeUncategorizedనేరస్థుడి కుమార్తెకు పెళ్లి చేసిన పోలీసులు

నేరస్థుడి కుమార్తెకు పెళ్లి చేసిన పోలీసులు

Date:

ఏడాది క్రితం పోలీసు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నేరస్థుడి కుమార్తెకు పోలీసులు తమ సొంత డబ్బుతో ఘనంగా వివాహం చేసి ఆదర్శంగా నిలిచారు. 2023, మే 10న ఉత్తరప్రదేశ్ ఒరాయ్‌ జిల్లా కొత్వాలి కానిస్టేబుల్‌ భేద్జిత్‌ సింగ్‌ను హత్యచేయడంతో రమేష్ రైక్వార్, కల్లు అహిర్వార్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. మరణించిన రమేష్ కుటుంబం చాలా పేదరికంలో ఉండడం, ఇద్దరు కుమార్తెలు ఉండడంతో నిందితుడి కుటుంబానికి అండగా ఉంటామని, అమ్మాయిల వివాహంలో సహాయం చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.

ఇటీవల రమేష్‌ సతీమణి తారా రైక్వార్‌ తన కుమార్తె వివాహానికి సహకారం అందించాల్సిందిగా జలాన్‌ పోలీసులను కోరారు. దీంతో వారు వెంటనే స్పందించి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లకు తమ సొంత డబ్బులను అందించారు. మార్చి 2న ఘనంగా వివాహం జరిపించారు. నూతన వధూవరులకు కానుకలు అందించారు. దీనిపై సర్కిల్ ఆఫీసర్ గిరిజా శంకర్ త్రిపాఠి మాట్లాడుతూ ” కుమార్తె వివాహం కోసం మహిళ మమ్మల్ని సంప్రదించగానే ఎలాగైనా సహాయం చేయాలని నిశ్చయించుకున్నాం. మేమంతా కలిసి చందాలు వేసుకున్నాం, కొందరు ప్రజలు కూడా ఇందుకోసం ఆర్థిక సహాయం చేశారు. నూతన వధూవరులకు కానుకగా బైక్‌, ఇతర గృహోపకరణాలు ఇచ్చాము. ఘనంగా వివాహం జరిపించామని తెలిపారు.

భర్తను నేను కోల్పోయిన సమయంలో కుటుంబాన్ని ఎలా నెగ్గుకురావాలని బాధ పడ్డాను. అప్పుడు వీరే ధైర్యం చెప్పారు. ఇప్పుడు నా కుమార్తె వివాహం ఘనంగా జరిపించి మాకు అండగా నిలిచారు. పోలీసుల్లో ఇంత మంచి మనసుంటుందని నేనెప్పుడూ అనుకోలేదని” తారా రైక్వార్‌ తెలిపారు. ఘనంగా వివాహం జరిపించిన పోలీసుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని, తన జీవితంలో మరపురాని క్షణాలను అందంగా మలచిన పోలీసు అధికారులకు కృతజ్ఞతలు అని వధువు శివాని రైక్వార్ తెలిపింది.