Thursday, September 26, 2024
HomeUncategorizedఢిల్లీ లిక్కర్ కేసులో 170 ఫోన్లు మిస్

ఢిల్లీ లిక్కర్ కేసులో 170 ఫోన్లు మిస్

Date:

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ అధికారుల కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. ఆదివారం ఈడీ విచారణలో ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. మద్యం పాలసీ రూపొందించే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్ గురించి ఈడి అధికారులు పదేపదే ప్రశ్నించారు. ఆ ఫోన్ ఎక్కడుంది, ఆ ఫోన్ తమకు కావాలంటూ కేజ్రీవాల్ ను అడిగారు. అయితే దీనికి ఆయన ఆ ఫోన్ ఎక్కడుందో తనకు తెలియదు అంటూ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మద్యం పాలసీ రూపొందించిన సమయంలో కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్ ను మిస్సింగ్ మొబైల్ గా పేర్కొంటున్నారు. అందులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక డేటా ఉన్నట్టు వారు అనుమానిస్తున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు అరవింద్ కేజ్రీవాల్ ని ప్రశ్నించినప్పటికీ ఆయన ఆ మొబైల్ ఫోన్ విషయంలో నోరు మెదపలేదు అని సమాచారం. ఇప్పటివరకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో 170 ఫోన్లు మిస్ అయినట్టు, ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ 171వ ఫోన్ అని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న చాలామంది మొబైల్ ఫోన్లను, లాప్టాప్ లను ధ్వంసం చేసి కొత్త వాటిని ఉపయోగిస్తున్నారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం ఈ కేసుకు సంబంధించి 17 మొబైల్ ఫోన్లలో డేటాను ట్రేస్ చేసినట్టు ఈడీ వర్గాలు చెప్తున్నాయి.

మిగతా అన్ని మొబైల్ ఫోన్లను నిందితులు ధ్వంసం చేసినట్టు ఈడీ వర్గాల భోగట్టా. ఇదిలా ఉంటే నేడు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈడి విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత విచారణ కూడా కొనసాగుతుంది. ఇదే సమయంలో ఈ కేసులో సమీర్ మహేంద్రు వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు. రేపు మనీష్ సిసోడియా కార్యదర్శిగా ఉన్న సి అరవింద్ ఎదుట కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.