Monday, September 30, 2024
HomeUncategorizedచల్లటి ఊటీలో మండుతున్న ఎండలు

చల్లటి ఊటీలో మండుతున్న ఎండలు

Date:

దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మైదాన ప్రాంతాలతో పాటు కొండ ప్రాంతాల్లోనూ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోనే అత్యంత చల్లటి ప్రదేశాలుగా, హిల్ స్టేషన్లుగా ఇంతకాలం మనం చెప్పుకుంటున్న ప్రాంతాలు సైతం ఈసారి మండిపోతున్నాయి. ప్రతీ ఏటా వేసవిలో దేశంలో వేడిని తట్టుకోలేక హిల్ స్టేషన్లను ఆశ్రయించే జనం ఇప్పుడు ఉష్ణోగ్రతలు కూడా తట్టుకోలేని పరిస్ధితి నెలకొంది.

దేశంలోని చల్లటి ప్రాంతాల్లో ఒకటైన తమిళనాడులోని ఉదకమండలం (ఊటీ) కూడా వేడెక్కింది. అది ఏ స్ధాయిలో అంటే గత 73 ఏళ్లలో తొలిసారి ఊటీలో రికార్డు స్ధాయి ఉష్ణోగ్రత నమోదైంది. తాజాగా ఈ మేరకు ఊటీలో 29 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనట్లు తమిళనాడు వాతావారణ విభాగం ప్రకటించింది. సాధారణ రోజుల్లో ఊటీలో ఉష్ణోగ్రత కేవలం 5.4 డిగ్రీలు మాత్రమే. అంటే ఊటీలో వాతావరణం ఏ స్ధాయిలో మారిపోయిందో తెలుస్తోంది.

1951 ఏప్రిల్ లో చివరి సారిగా ఊటీలో 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరిగి 73 ఏళ్ల తర్వాత అదే 29 డిగ్రీల ఉష్ణోగ్రత ఇప్పుడు నమోదైంది. దీంతో ఏటా వేసవిలో ఊటీకి వెళ్లే వీఐపీలు సైతం మనసు మార్చుకోవాల్సిన పరిస్దితి కనిపిస్తోంది. వాస్తవానికి ఊటీతో పాటు తమిళనాడులోని పాలక్కాడ్, ఇతర చల్లటి ప్రాంతాల్లోనూ ఈసారి వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. దీని ప్రభావం ఊటీ మీద కూడా పడినట్లు తెలుస్తోంది. అయితే ప్రముఖ పర్యాటక స్ధలం కావడంతో అక్కడి రిసార్టులు, హోటళ్లకు గిరాకీ తగ్గుతోంది.