Tuesday, October 1, 2024
HomeUncategorizedకేజ్రీవాల్‌ బెయిల్ రిజర్వ్‌లో పెట్టిన సుప్రీంకోర్టు

కేజ్రీవాల్‌ బెయిల్ రిజర్వ్‌లో పెట్టిన సుప్రీంకోర్టు

Date:

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. ఆయన పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు విన్న దేశ సర్వోన్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది. తదుపరి విచారణ గురువారం లేదా వచ్చే వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కేజ్రీ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఓ పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని విచారణ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని, ఒక‌వేళ మ‌ధ్యంత‌ర బెయిల్‌ను మంజూరు చేస్తే.. అప్పుడు ఎక్సైజ్ పాల‌సీ కేసుతో లింకున్న ఫైల్స్‌ను కేజ్రీ చూడ‌రాదు అని అత్యున్నత న్యాయ‌స్థానం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని సూచించింది.

సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని ఈడీ వ్యతిరేకించింది. సీఎం అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించకూడదని అభిప్రాయపడింది. కేసుల విషయంలో రాజకీయ నాయకులకు మినహాయింపు ఉండకూడదని స్పష్టం చేసింది. ఇరు పక్షాల వాదనలూ విన్న అత్యున్నత న్యాయస్థానం ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదు. తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది. మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. మే 20వ తేదీకి కేజ్రీ కస్టడీని పొడిగిస్తూ తీర్పు చెప్పింది.