Thursday, September 26, 2024
HomeUncategorizedఉత్త‌రాఖండ్‌లో 1671 ప్ర‌భుత్వ స్కూళ్లు మూసివేత

ఉత్త‌రాఖండ్‌లో 1671 ప్ర‌భుత్వ స్కూళ్లు మూసివేత

Date:

ఉత్త‌రాఖండ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్య‌వ‌స్థ దారుణంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అక్క‌డ ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌భుత్వ స్కూళ్ల‌ల్లో విద్యార్థుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 1671 స్కూళ్ల‌ను మూసివేసిన‌ట్లు విద్యాశాఖ కార్యాల‌యం వెల్ల‌డించింది. ఇక సుమారు 3573 స్కూళ్ల‌లో విద్యార్థుల చేరిక త‌గ్గిపోయింద‌ని, ఆ స్కూళ్ల‌లో ప‌ది లేదా అంత‌క‌న్నా త‌క్కువ విద్యార్థులు చేరిన‌ట్లు ప్ర‌భుత్వం చెప్పింది. 102 స్కూళ్ల‌లో కేవ‌లం ఒక్క విద్యార్థి మాత్ర‌మే ఎన్‌రోల్ అయిన‌ట్లు వెల్ల‌డించారు. పౌరి జిల్లాలో అత్య‌ధికంగా 315 స్కూళ్ల‌ను మూసివేశారు. ఉద్ద‌మ్ సింగ్ న‌గ‌ర్ జిల్లాలో అత్య‌ల్పంగా కేవ‌లం 21 స్కూళ్ల‌ను మాత్ర‌మే మూసివేశారు.

ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం మాత్రం మ‌రో ఆలోచ‌న చేస్తున్న‌ది. ఫిన్‌ల్యాండ్ మోడ‌ల్‌ను అనుస‌రించాల‌ని చూస్తున్నది. మెరుగైన విద్యా ప్ర‌మాణాల‌ను పాటించేందుకు విద్యా వ్య‌వ‌స్థ‌ను తీర్చిదిద్దాల‌ని ఆలోచిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి.. నాలుగు రోజుల పాటు ఫిన్‌ల్యాండ్‌, స్విట్జ‌ర్లాండ్ దేశాల్లో ప‌ర్య‌టించారు. ఆల్మోరాలో 197, బ‌గేశ్వ‌ర్‌లో 53, చ‌మోలీలో 144, చంపావ‌త్‌లో 55, డెహ్రాడూణ్‌లో 124, హ‌రిద్వార్‌లో 24,నైనిటాల్‌లో 82, పౌరిలో 315, పిత్తోర్‌ఘ‌డ్‌లో 224, రుద్ర‌ప్ర‌యాగ్‌లో 53, తెహ్రిఘ‌ర్‌వాల్‌లో 268, ఉద్ద‌మ్ సింగ్ న‌గ‌ర్‌లో 21,ఉత్త‌ర‌కాశీలో 122 స్కూళ్ల‌ను మూసివేశారు. మూసివేసిన స్కూళ్ల స్థానంలో ఆ బిల్డింగ్‌ల‌ను అంగ‌న్‌వాడీ కేంద్రాలుగా వాడేందుకు నిర్ణ‌యించారు. హోమ్ స్టేస్, ఏఎన్ఎం, గ్రామ్ పంచాయతీ హాల్స్‌గా వాడ‌నున్నారు. ప్ర‌జ‌ల ల‌బ్ధి కోసం ఆ స్కూళ్ల‌ను వాడుతామ‌ని విద్యాశాఖ అధికారి తెలిపారు.