Monday, September 23, 2024
HomeUncategorizedఈ సారి వేసవిలో రోళ్లు పగిలే ఎండలు

ఈ సారి వేసవిలో రోళ్లు పగిలే ఎండలు

Date:

అప్పుడే ఎండలు మండుతున్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే ఉదయం 10 గంటల తర్వాత నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతున్నాయి. మార్చి నెలాఖరుకు ఈ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తుంది.

అయితే ఈసారి గతేడాది కంటే ఎండలు మండి పోతాయని, రోళ్లు పగిలే ఎండలు నమోదు అవుతాయని భారత వాతావరణ శాఖ తేల్చి చెప్పింది. అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం నమోదయ్యే అవకాశం ఉందని, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతారని పేర్కొంది. అందుకు గల కారణాలను కూడా వెల్లడించింది.

ఎల్‌నినో పరిస్థితులు ఈ సీజన్ లోను కొనసాగుతాయని, ఈ పరిస్థితుల కారణంగా భారతదేశంలో వేసవి ప్రారంభంలోనే ఎండ తాకిడి ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజులే ఎక్కువగా ఉంటాయని పేర్కొంటూ నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చి, మే నెల మధ్యలో భారతదేశంలో అత్యధిక గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర కర్ణాటక, ఈశాన్య భారతంతో కూడిన ప్రాంతాలలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని, ఇక ఇదే సమయంలో దేశంలో మార్చి నెలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర వెల్లడించారు.