Tuesday, October 1, 2024
HomeUncategorizedఅంతా నిశ్శబ్దం..! ముగిసిన ప్రచార హోరు

అంతా నిశ్శబ్దం..! ముగిసిన ప్రచార హోరు

Date:

తెలుగు రాష్ట్రాల్లో ప్రచార జోరు ముగిసింది. శనివారం సాయంత్రం మైకులు మూగబోయాయి. సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో భాగంగా తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు, ఏపీలో 25 పార్లమెంట్‌, 175 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 13న పోలింగ్‌ జరగనుంది. 

అత్యంత సమస్యత్మాక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు, సమస్యాత్మక నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటలకు ప్రచారం నిలిపివేశారు. రాష్ట్రంలోని మిగతా 169 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం పరిసమాప్తమైంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత తెదేపా అధినేత చంద్రబాబు దాదాపు 90 ప్రజాగళం సభల్లో పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి తరఫున ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

తెలంగాణలో పోటాపోటీ

తెలంగాణలోని 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సోమవారం సాయంత్రం 6 గంటల వరకు, 13 సమస్యాత్మక సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఓటింగ్‌కు నిర్దేశించిన సమయం ప్రకారమే శనివారం సాయంత్రం ప్రచారానికి గడువు ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, భారాస, భాజపాలు అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పరస్పర విమర్శలు, ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. రాష్ట్రంలోని 16 స్థానాల్లో మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీపడుతుండగా, హైదరాబాద్‌లో మాత్రం ఎంఐఎం కీలకంగా ఉంది.