మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ ఐనా ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టును సవాలు చేస్తూ గురువారం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం కోర్టు విచారణ జరపనుంది. అరెస్టుకు ముందు రాష్ట్ర ప్రజలు, పార్టీ నేతలను ఉద్దేశించి సోరెన్ ఓ వీడియోను రికార్డు చేశారు. బుధవారం రికార్డు చేసిన ఆ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈడీ నన్ను అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దానికి నేనేమీ బాధపడటం లేదు. ఎందుకంటే నేను శిబుసోరెన్ కుమారుడిని. రోజంతా ప్రశ్నించిన తర్వాత నాకు సంబంధంలేని కేసులో అధికారులు అరెస్టు చేయాలని నిర్ణయానికి వచ్చారు. వారు ఎలాంటి ఆధారాలను గుర్తించలేదు. దిల్లీలోని నివాసంలో సోదాలు నిర్వహించి నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు యత్నించారు. పేదలు, ఆదివాసీలు, దళితులు, అమాయక ప్రజలపై అరాచకాలకు పాల్పడే వారిపై ఇప్పుడు సరికొత్త పోరాటం చేయాల్సి ఉందని సోరెన్ ఆ వీడియోలో అన్నారు.