Wednesday, October 2, 2024
Homeక్రైంమతిస్థిమితం లేదని బిడ్డకు ఉరేసిన తల్లిదండ్రులు

మతిస్థిమితం లేదని బిడ్డకు ఉరేసిన తల్లిదండ్రులు

Date:

మానసిక సమస్యలతో బాధపడుతున్న కూతురి మెడకు ఆ తల్లిదండ్రులు ఉరివేసి హతమార్చారు. ఈ దారుణ ఘటన సిరిసిల్ల జిల్లాలో ఆలస్యం వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్‌మహాజన్‌ వివరాల ప్రకారం గతంలో మానసిక రుగ్మతతో బాధపడుతున్న కూతురికి లక్షలు ఖర్చుచేసి చికిత్స చేయించారు. వ్యాధి కొంత నయం కావడంతో బిడ్డకు పెళ్లి చేశారు. భర్త, నెలల కొడుకుతో చక్కగా కాపురం చేసుకుంటున్న కూతురుని చూసి మురిసిపోయారు. కానీ వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. నెల కిందట వ్యాధి మళ్లీ తిరగబెట్టడంతో భర్త, కొడుకును కొట్టడం, చుట్టుపక్కల వారితో తరుచూ గొడవ పడటం ప్రారంభించింది. 

 దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు ఈ నెల14న రాత్రి ఒంటి గంట సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న కూతురిని నూలు దారంతో ఉరేసి చంపేశారు. అనంతరం ప్రియాంక మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆమె భర్త.. మృతదేహాన్ని నంగునూరుకు తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు చేశారు. అయితే స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ప్రియాంక మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ప్రియాంక తల్లిదండ్రులు నర్సయ్య, ఎల్లవ్వలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు. హత్యకు ఉపయోగించిన నూలు దారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. దీంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.