Tuesday, October 1, 2024
HomeUncategorized10 ఏళ్ల వయస్సులో వ్యాపారం మొదలెట్టిన జస్‌ప్రీత్

10 ఏళ్ల వయస్సులో వ్యాపారం మొదలెట్టిన జస్‌ప్రీత్

Date:

కష్టాలు లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి కష్టాలు, సమస్యలు ఉంటాయి. బతకడానికి, సక్సెస్ అవ్వడానికి ప్రతి క్షణం పోరాటం చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం తమకు ఎదురయ్యే సవాళ్లను స్ఫూర్తిగా మార్చుకొని, సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి వారిలో ఒకడు పదేళ్ల జస్‌ప్రీత్‌. ఈ బాలుడు ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారాడు. జస్‌ప్రీత్‌కు కేవలం 10 ఏళ్ల వయస్సు ఉంటుంది. ఇటీవల తండ్రి అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ బాధ్యతలను తన భుజాన వేసుకున్నాడు. చదువుతో పాటు, రోడ్డుపక్కన స్టాల్ పెట్టి రోల్స్ అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి కథను ఒక ఫుడ్ వ్లాగర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

జస్‌ప్రీత్‌ స్టోరీ చాలా మంది హృదయాలను కదిలించింది. అతడు ఫుడ్ తయారు చేస్తూ తన గురించి చెప్పిన వీడియో వైరల్ అయింది. దీన్ని చూసిన నెటిజిన్లు, బాలుడి కష్టానికి ఫిదా అవుతున్నారు. జస్‌ప్రీత్‌ తల్లి అతన్ని, 14 ఏళ్ల అక్కను వదిలి వెళ్లిపోయిందని తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు. తల్లిదండ్రులు లేకపోయినా భయపడకుండా కష్టపడుతున్న అతని ధైర్యాన్ని చూసి స్ఫూర్తి పొందుతున్నారు. ఈ వీడియోను ప్రముఖ భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేసి, బాలుడి గొప్పతనాన్ని మెచ్చుకున్నారు.

ఢిల్లీలో రోడ్డు పక్కన స్టాల్‌లో ఎగ్ రోల్స్ అమ్ముతున్న జస్‌ప్రీత్ వీడియో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టికి వచ్చింది. తండ్రి మెదడు వ్యాధితో మరణించడంతో బాలుడు చిన్నతనంలోనే స్టాల్‌ను నడిపే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నాడని తెలిసి ఆయన చలించి పోయారు. జస్‌ప్రీత్‌ కాంటాక్ట్ వివరాలను అడిగారుజ మహీంద్రా ఫౌండేషన్ ద్వారా బాలుడి విద్యకు సహాయం చేసేలా చూస్తామని చెప్పారు. ముందు ‘సరబ్‌జీత్ సింగ్’ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ జస్‌ప్రీత్‌ వీడియోను షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు, జస్‌ప్రీత్ కష్టపడి పనిచేసే తత్వాన్ని ప్రశంసించారు. ఈ వీడియో ఏడు రోజుల క్రితం షేర్ చేయగా ఇప్పటికే 10 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి. జస్‌ప్రీత్‌ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేశారు.