Monday, September 30, 2024
HomeUncategorizedకొడుకు లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్‌మిల్‌

కొడుకు లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్‌మిల్‌

Date:

కన్న కొడుకు లావుగా ఉన్నాడని భావించిన తండ్రి ట్రెడ్‌మిల్‌పై బలవంతంగా పరిగెత్తించాడు. బాలుడి వయసును కూడా చూడకుండా వేగాన్ని విపరీతంగా పెంచాడు. దీంతో అభంశుభం తెలియని ఆ బాలుడు గాయాలపాలై కొన్ని రోజులకు ప్రాణాలు విడిచాడు. అమెరికాలో మూడేళ్ల క్రితం జరిగిన ఈ విషాదకర ఘటనకు సంబంధించిన దృశ్యాలు విచారణ కారణంగా వెలుగులోకి వచ్చాయి.

కుమారుడి మృతికి కారణమయ్యాడన్న అభియోగాలపై న్యూజెర్సీకి చెందిన క్రిస్టోఫర్‌ గ్రెగర్‌ 2021లో అరెస్టయ్యాడు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కోర్టులో విచారణ జరగగా బాలుడి మృతికి కారణమైన ట్రెడ్‌మిల్‌ పరుగు దృశ్యాలను సాక్ష్యాలుగా న్యాయస్థానంలో ప్రదర్శించారు. ఆ ఏడాది మార్చి 20న క్రిస్టోఫర్‌ తన కుమారుడు కోరీని తీసుకుని స్థానికంగా ఉన్న ఓ ఫిట్‌నెస్‌ సెంటర్‌కు తీసుకెళ్లాడు.

బాలుడు లావుగా ఉన్నాడని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తించాడు. అతడికి కష్టంగా అనిపిస్తున్నా సరే వేగాన్ని చాలా పెంచాడు. దీంతో ఆ బాలుడు పలుమార్లు కిందపడిపోయాడు. అయినప్పటికీ ఆగకుండా ఆ తండ్రి బలవంతంగా తన కొడుకును ట్రెడ్‌మిల్‌ ఎక్కించాడు. వద్దని చెబితే కొట్టాడు. కొన్ని రోజులకు అతడు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో 2021 ఏప్రిల్‌ 1న బాలుడిని తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఆ మరుసటిరోజే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. స్కానింగ్‌లో అతడి అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలైనట్లు తేలింది. గుండె, కాలేయంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల కారణంగా అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అదే ఏడాది జులైలో క్రిస్టోఫర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ఈ దృశ్యాలను చూసి బాలుడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ కేసులో అతడికి జీవితఖైదు పడే అవకాశముంది.