Monday, September 30, 2024
HomeUncategorizedభర్తకు విడాకులిచ్చిన బిడ్డకు మేళతాళాలతో స్వాగతం

భర్తకు విడాకులిచ్చిన బిడ్డకు మేళతాళాలతో స్వాగతం

Date:

అత్తగారి ఇంట్లో వేధింపులకు తట్టుకోలేక భర్తతో విడాకులు తీసుకుంది. బిడ్డ చేసిన పనికి ఆమె తండ్రి కూడా మెచ్చుకున్నాడు. అంతేకాదు ఆమెను మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకొచ్చాడు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కాన్పూర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిల్‌కుమార్‌ అనే ఓ వ్యక్తి ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న తన కుమార్తె ఉర్వి (36) ని 2016లో ఢిల్లీకే చెందిన కంప్యూటర్ ఇంజినీర్‌కు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు.

కొన్ని రోజులు బాగానే ఉర్వి అత్తింటివాళ్లు ఆ తర్వాత వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. గత ఎనిమిదేళ్లుగా వాళ్లలో ఎలాంటి మార్పు రాకపోతే వేధింపులు అంతకంతకే పెరిగిపోయాయి. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. గత ఫిబ్రవరి 28న కోర్టు తీర్పు వెలువడింది. ఆమె అభ్యర్థన మేరకు న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. దాంతో ఉర్వి తండ్రి ఆమెను అత్తవారి ఇంటి నుంచి బ్యాండ్‌ బాజాలతో, మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకెళ్లాడు.

‘మేము మా కూతురిని పెళ్లిచేసి అత్తారింటికి ఎలా పంపామో అలాగే పుట్టింటికి తెచ్చుకున్నాం. విడాకులతో మా కుమార్తె, మనవరాలు నిరాశలో ఉండిపోకూడదని, నేటి నుంచి వాళ్లు సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించాలని ఈవిధంగా చేశాం’ అని అనిల్ కుమార్ తెలిపారు. కాగా, తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ముందు కొంత సమయం తీసుకుంటానని ఉర్వి చెప్పారు. ఉర్విని ఆమె తండ్రి మేళతాళాలతో తీసుకొచ్చిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. కష్ట సమయంలో కూతురుకు తోడుగా నిలిచిన ఆ తండ్రిని నెటిజన్‌లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. గతంలోనూ జార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి విడాకులు తీసుకున్న తన కూతురిని ఇలాగే మేళతాళాలు, బాణసంచా సందడితో పుట్టింటికి ఆహ్వానించారు.