Monday, September 30, 2024
HomeUncategorizedకేసీఆర్‌ హాయాంలో రెప్పపాటు కూడా కరెంట్ పోలే

కేసీఆర్‌ హాయాంలో రెప్పపాటు కూడా కరెంట్ పోలే

Date:

కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ప్రజలకు కరెంటు కష్టాలు మొదలైనయని అన్నారు. మా పాలనలో వచ్చిన కరెంటు ఇప్పుడు ఎక్కడికి మాయమైపోయిందని బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు.

‘మేం అధికారంలోకి రాంగనే ఆరు గ్యారంటీలకు చట్టం చేసి, చట్టబద్ధత కల్పించి అందరికీ న్యాయం చేస్తమని ఆనాడు కాంగ్రెస్‌ నేతలు చెప్పిండ్రు. కానీ ఏది కూడా చెయ్యలే. మరె ఏంజేస్తున్నరు వీళ్లు. ఆనాడు 24 గంటల కరెంటు వచ్చింది రైతాంగానికి. ఇప్పుడు కరెంటు వస్తుందా..? లేదంటే కరెంటు కోతలు అయితున్నాయా..?’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు. జనం కరెంటు వస్తలేదనడంతో ‘మరె ఏమయ్యింది కరెంటుకు..? కేసీఆర్‌ ఉన్నప్పుడు ఒక రెప్పపాటు కూడా పోని కరెంటు ఇప్పుడు ఎక్కడికి మాయమైంది..?’ అన్నారు.

‘ఇదే జిల్లాలో ఒక గిరిజన గూడెం ఉంటది. పినపాక నియోజకవర్గంలో ఉంది ఆ గూడెం. బ్రహ్మాండంగా మిషన్‌ భగీరథ కార్యక్రమం పెట్టి ‘దొంగతోపు’ అనే ఆ చిన్న గిరిజన గూడేనికి కూడా నీళ్లు పంపినం. ఇయ్యాల అక్కడ మిషన్‌ భగీరథ నీళ్లు వస్తున్నయా..? వస్తలేవు. అక్కడ కూడా ఇబ్బందే జరుగుతున్నది. అదేవిధంగా గిరిజన బిడ్డలకు త్రీ ఫేజ్‌ కరెంటు ఇవ్వాలని, అక్కడ కూడా బ్రహ్మండంగా వ్యవసాయం జరగాలని, పంటలు సక్రమంగా పండాలని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి త్రీ ఫేజ్‌ కరెంటు ఇప్పించినం. ఇయ్యాల అక్కడ మోటార్లు కాలుతున్నయ్‌. పొలాలు ఎండిపోతున్నయ్‌, రైతులు బాధపడుతున్నరు’ అని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు.