Monday, September 30, 2024
HomeUncategorizedకేజ్రీవాల్‌ను కలిసేందుకు భార్యకు అనుమతివ్వలే

కేజ్రీవాల్‌ను కలిసేందుకు భార్యకు అనుమతివ్వలే

Date:

ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తిహార్ జైల్లో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. సోమవారం ఆయనను కలిసి మాట్లాడేందుకు సీఎం సతీమణి సునీత అనుమతి కొరగా అధికారులు అంగీకరించలేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఆప్‌ నేత ఆతిశీకి అనుమతినిచ్చిన నేపథ్యంలో సునీత అభ్యర్థనను తిరస్కరించామని జైలు అధికారులు చెప్పారని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

ఢిల్లీ మంత్రి ఆతిశీ సోమవారం సీఎంతో మాట్లాడనున్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ మంగళవారం తిహార్ జైలుకు వెళ్లి కేజ్రీవాల్‌ను కలవనున్నారు. దీంతో మంగళవారం తర్వాతే సునీతను అనుమతించనున్నట్లు జైలు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారం వారంలో రెండుసార్లు మాత్రమే ములాఖత్‌కు అనుమతి ఉంది. దీంతో భర్తను చూసేందుకు సునీతకు వచ్చేవారమే అనుమతి లభించనుంది.

జైల్లో ఉన్న వ్యక్తితో ఒకేసారి ఇద్దరు వ్యక్తులు మాట్లాడే వీలుందని, అయినప్పటికీ తిహార్ అధికారులు సునీతను అనుమతించడం లేదని ఆప్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల భగవంత్‌ మాన్‌.. కేజ్రీవాల్‌ను కలిసినప్పుడు పంజాబ్‌ సీఎం వెంట ఆప్‌ జనరల్‌ సెక్రటరీ సందీప్‌ పాథక్‌ ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఉద్దేశపూర్వకంగానే సునీతను జైలు అధికారులు అనుమతించడం లేదని దుయ్యబట్టారు.