Tuesday, September 24, 2024
HomeUncategorizedరేషన్ కార్డు ఎప్పుడు అడ్రస్ ప్రూఫ్ కాదు

రేషన్ కార్డు ఎప్పుడు అడ్రస్ ప్రూఫ్ కాదు

Date:

ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నిత్యావసర వస్తువులను పొందేందుకు ప్రత్యేకంగా రేషన్ కార్డు జారీ చేస్తారని, రేషన్ కార్డు అడ్రస్ ప్రూఫ్ కాదని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో రేషన్‌ కార్డును చిరునామా లేదా నివాసానికి సంబంధించిన రుజువుగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలోని కాత్పుత్లీ కాలనీని అభివృద్ధి చేసిన తర్వాత పునరావాస పథకం కింద ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని కోరుతూ పూర్వపు నివాసితులు దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి చంద్ర ధారి సింగ్ విచారణ జరిపారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు తప్పనిసరి ధృవీకరణ పత్రంగా రేషన్ కార్డు ఉండాలని అధికార నోటీస్‌లో పేర్కొనడాన్ని తప్పుపట్టారు. ఈ నిర్ణయం ఏకపక్షం, చట్టవిరుద్ధమని అన్నారు.

రేషన్ కార్డు నిర్వచనం ప్రకారం దానిని జారీ చేయడంలో ప్రభుత్వం ఉద్దేశాన్ని న్యాయమూర్తి వివరించారు. ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలను సరసమైన ధరలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించడమే రేషన్‌ కార్డు లక్ష్యమని తెలిపారు. ఈ నేపథ్యంలో రేషన్‌ కార్డును అడ్రస్ ప్రూఫ్ లేదా నివాస గుర్తింపు రుజువుగా పరిగణించలేమని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.