Tuesday, September 24, 2024
HomeUncategorizedదేశంలో ఎండలు, ఢిల్లీలో మాత్రం వణికించే చలి

దేశంలో ఎండలు, ఢిల్లీలో మాత్రం వణికించే చలి

Date:

దాదాపు దేశవ్యాప్తంగా ఎండలు మండుతుంటే దేశ రాజధాని ఢిల్లీని మాత్రం చలి వణికిస్తోంది. శీతాకాలంలో అయితే ఉదయం 9, 10 గంటలకు కూడా ఢిల్లీలో దట్టమైన పొగమంచు ఆవహించి ఉంటుంది. కానీ శీతాకాలం పోయి ఎండా కాలం వచ్చినా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం మార్పు రాలేదు. దీంతో ఢిల్లీ వాసులు చలి గుప్పిట్లో నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు. అక్కడ మార్చి నెలలో సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతలతో పోల్చితే ఈసారి చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం హిమాలయాల నుంచి చలి గాలులు వీస్తుండటంతో ఢిల్లీలో వాతావరణం చల్లగా ఉందని భారత వాతావరణ శాఖ-ఐఎండీ తెలిపింది. గత 3 రోజులుగా ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. సాధారణంగా మార్చి నెల మొదటి 11 రోజుల్లో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని.. ఈసారి మాత్రం అంతకంటే తక్కువగా ఉందని వెల్లడించింది. గురువారం ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 8.8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిందని ఐఎండీ ప్రకటన విడుదల చేసింది. ఇది సాధారణ సగటు కంటే 5 డిగ్రీల సెల్సియస్ తక్కువ అని తెలిపింది. ఇక బుధవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 23.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని వెల్లడించింది. ఇది కూడా సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రత కంటే 4 డిగ్రీలు తక్కువేనని వివరించింది.

రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని.. భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వచ్చే ఆదివారం (మార్చి 10 వ తేదీ) నుంచి ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని.. ఈ క్రమంలోనే వచ్చే వారం మధ్యలో 29 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చని తెలిపింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి ప్రస్తుతం వీస్తున్న చలిగాలుల కారణంగా ఢిల్లీలో వాతావరణం చల్లగానే ఉంటుందని వివరించింది. ఈ ప్రాంతాల నుంచే వర్షం, హిమపాతం కురుస్తుంది కాబట్టి ఢిల్లీలో అకాల వాతావరణం కనిపిస్తోందని తెలిపింది. హిమాలయ ప్రాంతాల నుంచి వచ్చే చల్లని గాలులు మైదాన ప్రాంతాల్లో ఉన్న ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తున్నాయని.. నిపుణులు తెలిపారు. ఇక జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఉత్తరాఖండ్‌లో కూడా ఈ నెల 10 వ తేదీ నుంచి 12 వ తేదీ మధ్య వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.