Tuesday, September 24, 2024
HomeUncategorizedతొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు

తొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు

Date:

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసుకుంటూ వస్తోంది. తాజాగా మరో ప్రతిష్టాత్మకమైన పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రతి నిరుపేదకు ఇల్లు ఉండాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి పథకాన్ని అమలు చేయబోతోంది. ఈ పథకం కింద అర్హులు ఎవరు? ఏ ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ పథకంపై గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కీలక ఆదేశాలు జారీచేశారు. ఇళ్ల నిర్మాణానికి మార్గదర్శకాలు విడుదల చేయాలని, తొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు సాయం చేస్తున్నామని, కనీసం 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం జరిగేలా చూడాలని పొంగులేటి అధికారులకు సూచించారు. ఇంటి నిర్మాణంలో ఎవరూ, ఎక్కడా అవినీతికి పాల్పడే చిన్న అవకాశం కూడా ఇవ్వొద్దని, అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రజా పాలనకు వచ్చిన దరఖాస్తులు, రేషన్ కార్డుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం హడ్కో నుంచి ఇప్పటికే రూ.3వేల కోట్ల రుణం తీసుకుంది. వీటితో తెలంగాణ వ్యాప్తంగా 95,235 ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తారు. రుణం పొందేందుకు హడ్కో పేర్కొన్న షరతులను హౌసింగ్ బోర్డు అంగీకరించేలా ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. హడ్కో రుణానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గ్యారంటీ కూడా ఇచ్చింది.