Tuesday, September 24, 2024
HomeUncategorizedఎలక్ట్రిక్‌ వాహనాలతో హానికారక రసాయనాలు విడుదల

ఎలక్ట్రిక్‌ వాహనాలతో హానికారక రసాయనాలు విడుదల

Date:

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు భారత్‌ సహా ప్రపంచ దేశాలు ఎకో ఫ్రెండ్లీ విధానాలను అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈవీలు అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో కూడా ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్‌ కార్లు, ఆటోలను విక్రయిస్తున్నాయి. అయితే, పెట్రోల్‌, డీజిల్‌ కార్ల కంటే ఈవీలు కాస్త అధిక కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయట. ‘ఎమిషన్‌ అనలటిక్స్‌’ అనే సంస్థ రెండు రకాల కార్లలోని బ్రేకింగ్‌, టైర్ల నుంచి విడుదలయ్యే రేణువులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

సాధారణ కార్ల ఇంజిన్‌ కంటే ఈవీల్లోని బ్యాటరీలు ఎక్కువ బరువుగా ఉంటాయి. దీంతో బ్రేక్‌ వేసినప్పుడు టైర్లపై అధిక ఒత్తిడి ఏర్పడి హానికారక రసాయనాలను గాలిలోకి విడుదల చేస్తున్నాయని తెలిపింది. ఇది పెట్రోల్‌, డీజిల్‌ కార్లలో విడుదలయ్యే వాటి కంటే అధికమని వెల్లడించింది. సింథిటిక్‌ రబ్బర్‌, ముడి చమురుతో టైర్లను తయారు చేస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని నివేదికలో పేర్కొంది. పర్యావరణ హితం కోసం చాలా దేశాల్లో ఈవీలకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందిస్తున్నారు. క్రమంగా వీటి వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తయారీదారులు ఈవీల బ్రేకింగ్‌ వ్యవస్థ, టైర్ల నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాలని ‘ఎమిషన్‌ అనలటిక్స్‌’ సంస్థ సూచించింది. గతంలో ఐఐటీ కాన్పూర్‌ నిర్వహించిన అధ్యయనం ఇదే విషయాన్ని వెల్లడించింది. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల కంటే ఈవీల తయారీ, ఛార్జింగ్‌ కోసం ఉత్పత్తి చేసే విద్యుత్‌ వల్ల ఎక్కువ ఉద్గారాలు విడుదలవుతున్నాయని నివేదికలో పేర్కొంది.