Monday, September 23, 2024
HomeUncategorizedమోడీని కలవడం ఎప్పుడూ స్ఫూర్తిదాయకమే

మోడీని కలవడం ఎప్పుడూ స్ఫూర్తిదాయకమే

Date:

భారత ప్రధాని నరేంద్ర మోడీని కలవడం ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ అన్నారు. చాలా అంశాలు చర్చించాం. ప్రజా ప్రయోజనాల కోసం ఏఐ గురించి మాట్లాడాం. మహిళల నేతృత్వంలో అభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్యం, వాతావరణ అంశాల్లో ఆవిష్కరణలు సహా భారత్‌ నుంచి ఎలాంటి అంశాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలో చర్చించాం” అని గేట్స్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ భారత పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడితో గురువారం సమావేశమయ్యారు. ప్రజా శ్రేయస్సు కోసం కృత్రిమ మేధ, వ్యవసాయం, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలు, మహిళల భాగస్వామ్యంతో అభివృద్ధి వంటి అంశాలను చర్చించారు. బిల్ గేట్స్‌ పోస్టుకు మోడీ స్పందించారు. ”నిజంగా అద్భుతమైన సమావేశం! మన గ్రహాన్ని మెరుగుపరిచే, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తులను శక్తిమంతం చేసే రంగాల గురించి చర్చించడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది” అని ‘ఎక్స్’ వేదికగా అభిప్రాయపడ్డారు. అంతకుముందు గేట్స్‌ విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌తోనూ భేటీ అయ్యారు.

గేట్స్‌ మంగళవారం ఒడిశాకు చేరుకున్నారు. బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. భువనేశ్వర్‌లోని మురికివాడల్లో పర్యటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతోనూ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఐడీసీ)ను ఏర్పాటు చేసి పాతికేళ్లు అవుతున్న సందర్భంగా దాన్ని సందర్శించారు. మరోవైపు డాలీ చాయ్‌వాలాగా సామాజిక మాధ్యమాల్లో బాగా పేరు సంపాదించిన నాగ్‌పుర్‌ (మహారాష్ట్ర) వాసి సునీల్‌ పాటిల్‌ అందించిన తేనీటిని తాగారు. ఈ పర్యటనలో భాగంగానే ఆయన బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలకూ హాజరు కానున్నారు.