Monday, September 23, 2024
HomeUncategorizedఎంపీలు, ఎమ్మెల్యేలకు గోప్యతా హక్కు ఉంటుంది

ఎంపీలు, ఎమ్మెల్యేలకు గోప్యతా హక్కు ఉంటుంది

Date:

దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలకు గోప్యతా హక్కు కూడా ఉంటుంది. 24 గంటలూ వారి కదలికలను పర్యవేక్షించేందుకు వారి శరీరంలో ‘చిప్‌’ను పెట్టాలా? అని ప్రశ్నించింది. చట్టసభ సభ్యులను ఎల్లవేళలా పర్యవేక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటువంటి అంశాలతో కోర్టు సమయం వృథా చేసినందుకు రూ.5 లక్షల జరిమానాతో సిద్ధంగా ఉండాలని పిటిషనర్‌ను హెచ్చరించింది.

‘మీరు వాదించి, మేం మీతో ఏకీభవించకపోతే మీ నుంచి రూ.5 లక్షలు రికవరీ చేయాల్సి వస్తుంది. ఇది మా అధికారం గురించి కాదు. ఇది ప్రజా సమయం. ముఖ్యమైనవి అనేక అంశాలున్నాయి. మీరు ఏం వాదిస్తున్నారో అర్థమైందా? ఎంపీలు, ఎమ్మెల్యేలను 24 గంటలూ పర్యవేక్షించాలని కోరుతున్నారు. తప్పించుకొనే దోషులకు మాత్రమే ఇలా చేస్తారు. ఇది గోప్యతా హక్కు కిందకు వస్తుంది. ఎన్నికైన పార్లమెంటు సభ్యులందర్నీ డిజిటల్‌గా పర్యవేక్షించేందుకు వారి శరీరాల్లో చిప్‌ పెట్టలేం’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

ఎంపీలు, ఎమ్మెల్యేలను గమనించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన సురీందర్‌నాథ్‌ కుంద్రా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా సేవకులని.. కానీ, వాళ్లు పాలకుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని ధర్మాసనం దృష్టికి పిటిషనర్‌ తీసుకెళ్లారు. జోక్యం చేసుకున్న ధర్మాసనం.. అందరు ఎంపీలపై ఉమ్మడి అభియోగం మోపలేరని పేర్కొంది. ఇలాంటి అంశాలతో రావడం కోర్టు సమయాన్ని వృథా చేయడమేనంటూ పిటిషనర్‌ను తీవ్రంగా మందలించింది. పిటిషనర్‌ అంగీకరించడంతో ఎటువంటి జరిమానా విధించని న్యాయస్థానం సున్నితంగా హెచ్చరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.