Monday, September 23, 2024
HomeUncategorizedతెలంగాణ లోక్‌సభ అభ్యర్థులపై పార్టీల కసరత్తు

తెలంగాణ లోక్‌సభ అభ్యర్థులపై పార్టీల కసరత్తు

Date:

తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ సంఖ్యను భారీగా పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని లోక్‌సభ పోలింగ్‌లోనూ కొనసాగించాలని భావిస్తోంది. అటు ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి ఇదే పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని అధిగమించేలా లోక్‌సభ స్థానాలను గెలచుకోవడానికి కసరత్తు సాగిస్తోంది.

ఈ పరిస్థితుల్లో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలిచే వారికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో- అభ్యర్థుల తొలి జాబితాపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు దాదాపుగా కసరత్తు పూర్తి చేసింది. ఆశావహులను వడపోసింది. ఈ జాబితాలో పలువురు సీనియర్ నేతల పేర్లు ఉన్నాయి. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును పరిశీలిస్తోంది. ఇటీవలే ఆయన భారత్ రాష్ట్ర సమితికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.

ప్రతిష్ఠాత్మకమైన మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానానికి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరును ఖాయం చేస్తారని తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు మామ అయిన చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. ఇదివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్‌సభలో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహించిన నేపథ్యంలో- ఇక్కడ గెలవడం కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. మల్కాజ్‌గిరి లోక్‌సభ టికెట్ రేసులో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. మెదక్ లోక్‌సభ స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, త్రిష దామోదర్‌ పోటీ పడుతున్నారు.

చేవెళ్ల లోక్‌సభ బరిలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య, వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డిని నిలుపుతారని చెబుతున్నారు. వరంగల్- దొమ్మాటి సాంబయ్య, హరికోట్ల రవి, అద్దంకి దయాకర్, ఇందిరా సింగాపురం, డాక్టర్ ఆర్ పరమేశ్వర్ పోటీ పడుతున్నారు. నాగర్ కర్నూలు- మల్లు రవి, సంపత్ కుమార్, చారకొండ వెంకటేష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పెద్దపల్లి- బొర్లకొంట వెంకటేష్ నేత, పెర్క శ్యామ్ పేర్లను తెలంగాణ కాంగ్రెస్ వడబోసినట్లు సమాచారం. మహబూబ్ నగర్ స్థానానికి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి అవకాశం ఇస్తారని అంటున్నారు. నల్లగొండ కోసం జానారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పేర్లు పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది.