Monday, September 23, 2024
HomeUncategorizedఐదేళ్లు పూర్తయ్యేవరకు కాంగ్రెస్ ప్రభుత్వమే

ఐదేళ్లు పూర్తయ్యేవరకు కాంగ్రెస్ ప్రభుత్వమే

Date:

హిమాచల్‌ ప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు స్పందించారు. బిజెపి చేస్తున్న ఏ కుట్రలూ ఫలించవని.. ఐదేళ్లు పూర్తయ్యేవరకు రాష్ట్రంలో తమ కాంగ్రెస్‌ ప్రభుత్వమే కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. తాజా పరిస్థితులతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలపైనా స్పందించారు. ”కాంగ్రెస్‌ అధిష్ఠానం నన్నుగానీ, మరెవరినీ గానీ రాజీనామా చేయమని కోరలేదు. అలాంటిదేమీ జరగలేదు. ఇదంతా ఇక్కడి భాజపా నేతలు చేస్తున్న పనే. వారికి సొంత మనుషులపై నమ్మకం లేదు. సీఆర్‌పీఎఫ్‌, హరియాణా పోలీసుల్ని మోహరించారు. హెలికాప్టర్‌ కూడా వినియోగించారు” అన్నారు.

హిమాచల్‌లో ఒక రాజ్యసభ స్థానానికి మంగళవారం ఎన్నిక జరగ్గా ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌ వల్ల అక్కడ భాజపా అభ్యర్థి విజయంతో కాంగ్రెస్‌కు తీవ్ర భంగపాటు ఎదురైంది. ఈనేపథ్యంలో నెలకొన్న పరిణామాలతో అక్కడ ప్రభుత్వం పతనమవుతుందంటూ ఊహాగానాలు చెలరేగడంపై సీఎం సుఖు మాట్లాడారు. ”ఒక్క విషయం మాత్రం చెప్పదలచుకున్నా.. హిమాచల్‌ ప్రదేశ్ ప్రజలు, ఎమ్మెల్యేలు మావెంటే ఉన్నారు.. ఐదేళ్ల పాటు మా ప్రభుత్వాన్ని కొనసాగించగలమని కచ్చితంగా చెప్పగలను” అని చెప్పారు. అయితే, ఈ పరిస్థితులు తలెత్తడంలో ఆపరేషన్‌ కమలం పాత్రే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పుపై దాడిని తాము అనుమతించబోమన్నారు.