Monday, September 23, 2024
HomeUncategorizedఆరేళ్లు నిండిన చిన్నారులకే ఒకటవ తరగతి

ఆరేళ్లు నిండిన చిన్నారులకే ఒకటవ తరగతి

Date:

దేశంలోని ఏ పాఠశాలలో ఐనా ఇకపై ఆరేళ్లు నిండిన చిన్నారులకే ఒకటవ తరగతిలో ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. నూతన నూతన విద్యావిధానంలో భాగంగా పిల్లలకు 1వ తరగతి అడ్మిషన్‌పై కేంద్రం కీలక సూచనలు చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఈ అంశంపై లేఖలు రాసింది. ఆరేళ్లు నిండితేనే చిన్నారులకు ఒకటవ తరగతిలో అడ్మిషన్‌ ఇవ్వాలని సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం 2024-25 నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ 2020, రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ 2009 కింద 1వ తరగతిలో చేరే పిల్లలకు ఆరేళ్ల వయసు తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే.. 3 ఏళ్లు ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌, తర్వాత 2 ఏళ్లు ప్రాథమిక విద్యలో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్‌ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలనేదే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని కేంద్రం తన లేఖలో పేర్కొంది.

మూడేళ్ల వయసులో పిల్లలను పాఠశాలకు పంపడం వల్ల మంచి పునాది పడటంతో ప్రీ-స్కూల్‌ నుంచి రెండో తరగతి వరకు చిన్నారుల్లో లెర్నింగ్‌ ప్రక్రియ అలవడుతుందని తెలిపింది. అలాగే.. అంగన్‌వాడీలు, ప్రభుత్వ/ప్రభుత్వ ఎయిడెడ్‌, ప్రయివేటు, ఎన్జీవో సంస్థల ఆధ్వర్యంలో నడిచే ప్రీస్కూళ్లలో అభ్యసిస్తున్న చిన్నారులందరికీ ఒకటో తరగతిలో చేరడానికి ముందే నాణ్యమైన విద్యను మూడేళ్ల పాటు అందించేందుకు ఈ విధానం దోహదపడుతుందని కేంద్రం ఉద్దేశం. నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న వయసు నిబంధనను సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.