Monday, September 23, 2024
HomeUncategorizedరాహుల్ గాంధీపై మోడీ పరోక్ష విమర్శలు

రాహుల్ గాంధీపై మోడీ పరోక్ష విమర్శలు

Date:

వయనాడ్ స్థానం నుంచి కాంగ్రెస్ యువరాజును తరిమికొట్టాలని లెఫ్ట్ పార్టీలు కోరుకుంటున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ పరోక్ష విమర్శలు చేశారు. మంగళవారం కేరళలో పర్యటించిన ఆయన సెంట్రల్ స్టేడియంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ రెండు పార్టీలు కేరళలో బద్ధశత్రువులుగా ఉంటాయి. ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటాయి. వేరే రాష్ట్రాల్లో మాత్రం మంచి స్నేహితులుగా మెలుగుతాయి. ఆ పార్టీల నేతలు కలిసి కూర్చొని విందారగిస్తారు” అని మోడీ దుయ్యబట్టారు. వయనాడ్‌ నుంచి రాహుల్ గాంధీని వెళ్లగొట్టాలని లెఫ్ట్ పార్టీలు కోరుకుంటున్నాయి. కేరళకు దూరంగా ఉండమని ఆయనకు సలహా ఇస్తున్నాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య ఉన్న పొత్తుపై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వయనాడ్‌లో సీపీఐ అభ్యర్థిని నిలబెట్టిన నేపథ్యంలో మోడీ స్పందన వచ్చింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి యాని రాజాను అక్కడి అభ్యర్థిగా ప్రకటించింది. విపక్ష ‘ఇండియా’ కూటమిలోని ఇతర పార్టీలతో కాంగ్రెస్‌ ప్రస్తుతం సీట్ల సర్దుబాటు చర్చలు జరుపుతోంది. ఇంతలోనే ఇక్కడ ఈ కూటమిలోని సీపీఐ.. తన అభ్యర్థిని ప్రకటించడం గమనార్హం. అలానే ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న కేరళలోని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ సైతం మెజార్టీ ముస్లిం ఓటర్లు ఉన్న వయనాడ్‌ నుంచి పోటీ చేయాలని భావిస్తోందట. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ మరోసారి వయనాడ్‌ నుంచి పోటీలో ఉండకపోవచ్చని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.