Monday, September 23, 2024
HomeUncategorizedమీరు చేస్తారా.. మేము ముందడుగు వెయ్యాలా..

మీరు చేస్తారా.. మేము ముందడుగు వెయ్యాలా..

Date:

కేంద్ర ప్రభుత్వ అలసత్వంపై సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత తీరగస్తీ దళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటులో కేంద్రం స్వచ్ఛందంగా చర్యలు తీసుకోకుంటే తామే ఒక అడుగు ముందుకువేయాల్సి వస్తుందని హెచ్చరించింది. అర్హులైన షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారిణులతో శాశ్వత కమిషన్‌ ఏర్పాటుచేయాలని కోరుతూ ఇండియన్‌ కోస్ట్‌ గార్డుకు చెందిన ఓ అధికారిణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి వాదనలు వినిపించారు. ఆర్మీ, నేవీతో పోలిస్తే కోస్ట్‌ గార్డులో పనితీరు కొంచెం భిన్నంగా ఉంటుందని సుప్రీం ధర్మాసనం దృష్టికి అటార్నీ జనరల్‌ తీసుకెళ్లారు. మహిళలను మినహాయించేందుకు అవి కారణాలు కాదని పేర్కొంటూ ఏజీ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. మహిళలను వేరుగా చూడలేమని.. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తామే జోక్యం చేసుకుంటామని స్పష్టంచేసింది. అందుకే.. ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ స్పందనను అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాలని పేర్కొంటూ తదుపరి విచారణ మార్చి 1కి వాయిదా వేసింది.

వారం క్రితం ఇదే పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. మహిళలను సముచితంగా పరిగణించే విధానాన్ని రూపొందించాల్సిందేనని కేంద్రానికి స్పష్టంచేసింది. త్రివిధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ల ఏర్పాటుపై సుప్రీం తీర్పులిచ్చినా ఇంకా పూర్వకాల ఆలోచనలతోనే ఉన్నారా? అని నిలదీసింది. నౌకాదళంలో శాశ్వత కమిషన్‌ ఉన్నప్పుడు కోస్ట్‌గార్డ్‌ అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. స్త్రీ పురుష సమానత్వం ఉన్న విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.