Friday, January 3, 2025
HomeUncategorizedస్పామ్ కాల్స్‌, మెసెజ్‌ల‌పై ట్రాయ్ ఉక్కుపాదం

స్పామ్ కాల్స్‌, మెసెజ్‌ల‌పై ట్రాయ్ ఉక్కుపాదం

Date:

మెసేజింగ్‌ సర్వీసులను వినియోగించుకుని జరిగే మోసపూరిత విధానాల నుంచి యూజర్లను రక్షించేందుకు స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లపై ఉక్కుపాదం మోపేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సిద్ధమైంది. ఇందులో భాగంగా 14 సిరీస్‌తో ప్రారంభమయ్యే టెలీ మార్కెటింగ్‌ కాల్స్‌ను బ్లాక్‌ చెయిన్‌ సాయంతో పనిచేసే డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీకి మార్చాలనని టెలికాం కంపెనీలకు సూచించింది. ఇందుకు సెప్టెంబర్‌ 30ని గడువుగా నిర్దేశించింది. దీనివల్ల టెలీ మార్కెటింగ్‌ కాల్స్‌ను నిఘా, నియంత్రణ సాధ్యపడుతుందని ట్రాయ్‌ పేర్కొంది.

సెప్టెంబర్‌ 1 నుంచి అన్ని టెలికాం కంపెనీలు.. వెబ్‌సైట్‌ లింకులు, ఏపీకే ఫైల్స్‌, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో కూడిన సందేశాలు పంపించకూడదని ఆదేశాల్లో పేర్కొంది. వైట్‌ లిస్ట్ కాని కాల్‌బ్యాక్‌ నంబర్లు ఉన్నా ఆ సందేశాలు నిలిపివేయాలని సూచించింది. మెసేజ్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకూ కొత్త నిబంధనలను జారీ చేసింది. టెలీమార్కెటింగ్‌ చైన్‌తో సరిపోని, గుర్తు తెలీని నంబర్ల నుంచి వచ్చే సందేశాలను నవంబర్‌ 1 నుంచి పూర్తిగా రిజెక్ట్‌ చేయాలని సూచించింది.

రోజురోజుకూ పెరుగుతున్న స్పాట్‌ కాల్స్‌ను నియంత్రించడంపై ట్రాయ్‌ దృష్టిసారించింది. ముఖ్యంగా అనధికారిక కాల్స్‌, ప్రమోషనల్‌ కాల్స్‌ను నియంత్రణపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రిజిస్టర్‌ కాని టెలీ మార్కెటర్ల కాల్స్‌ను బ్లాక్ చేయాలని ఇటీవల ఆదేశించింది. అలాగే, ఎస్సెమ్మెస్‌ టెంప్లాట్‌లను దుర్వినియోగంపైనా నిఘా పెట్టింది. సాధారణంగా వ్యాపార సంస్థలకు తమ సబ్‌స్క్రైబర్లకు సందేశాలు పంపించేందుకు హెడర్‌లను కేటాయిస్తుంటారు. ఒకవేళ ఎవరైనా మెసేజ్‌ హెడ్‌లు, కంటెంట్‌ టెంప్లాట్స్‌ను ఉల్లంఘిస్తే.. వెంటనే ఆ హెడర్‌, కంటెంట్‌ టెంప్లేట్స్‌ నుంచి ట్రాఫిక్‌ను తక్షణమే నిలిపివేయాలని తాజా ఆదేశాల్లో ట్రాయ్‌ పేర్కొంది.