Saturday, October 5, 2024
HomeUncategorizedMRP ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారా..

MRP ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారా..

Date:

మనం ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తున్నప్పుడు వ్యాపారులు ఒక్కోసారి ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తారు. దీనివల్ల వినియోగదారులు నష్టపోతారు. అయితే భారత ప్రభుత్వ చట్టాల ప్రకారం వ్యాపారి ఎక్కువగా వసూలు చేస్తే, వారి నుంచి డబ్బు తిరిగి పొందవచ్చు. మాగ్జిమం రిటైల్ ప్రైస్ అనేది ఒక వస్తువు లేదా సేవ కోసం చిల్లర వ్యాపారి చట్టబద్ధంగా ఛార్జ్ చేయగల గరిష్ఠ మొత్తం. ఈ ధరను తయారీదారులు లేదా విక్రేతలు నిర్ణయిస్తారు. వీరు ఉత్పత్తి ఖర్చులు, మార్కెటింగ్ కాస్ట్స్, ప్రాఫిట్ మార్జిన్‌ను పరిగణనలోకి తీసుకుని ఎంఆర్పీని నిర్ణయిస్తారు. ఎంఆర్పీని సాధారణంగా ప్రొడక్ట్ లేబుల్ లేదా ప్యాకేజింగ్‌పై ప్రింట్ చేస్తారు. ఇందులోనే అన్ని ట్యాక్సెస్ ఇంక్లూడ్ చేస్తారు.

ఎక్కువ ధర వసూలు చేస్తే?

భారతదేశంలో 2009 లీగల్ మెట్రాలజీ చట్టం ప్యాక్ చేసిన వస్తువుల అమ్మకాలను నియంత్రిస్తుంది, చట్ట ప్రకారం, ప్రొడక్ట్ లేబుళ్లపై లేదా ప్యాకేజింగ్‌పై ఎంఆర్పీ స్పష్టంగా ప్రింట్ చేయడం తప్పనిసరి. MRP కంటే ఎక్కువ ధరకు ఉత్పత్తులను విక్రయించడం చట్టవిరుద్ధం, అలా చేసే వారికి జరిమానాలు, ఇతర శిక్షలు విధిస్తారు. కన్జ్యూమర్ గూడ్స్ (మాండేటరీ ప్రింటింగ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ మాగ్జిమం రిటైల్ ప్రైస్) యాక్ట్ 2006 ప్రకారం, ప్రొడక్ట్ ప్యాకేజింగ్‌పై సూచించిన MRP కంటే ఎక్కువ ధరను వ్యాపారులు వసూలు చేయలేరు.

ప్రశ్నించడం ముఖ్యం

ఎందుకు ఎక్కువ ధర వసూలు చేస్తున్నారో దుకాణదారుడిని అడగవచ్చు. బిల్లును చూపించి, MRP ధరను సూచించవచ్చు. చాలా సందర్భాలలో, దుకాణదారులు తప్పును గుర్తించి సరైన ధర వసూలు చేస్తారు. దుకాణదారుడు ఎక్కువగానే వసూలు చేస్తా అని మొండిగా వ్యవహరిస్తే రాష్ట్రంలోని సంబంధిత లీగల్ మెట్రాలజీ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

ఎక్కడ, ఎవరికి ఫిర్యాదు చేయాలి?

నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించడానికి టోల్-ఫ్రీ నెంబర్ 1800-11-4000 లేదా 1915కు కాల్ చేయవచ్చు. SMS ద్వారా 8800001915కు ఫిర్యాదు చేయవచ్చు.

NCH యాప్ (https://play.google.com/store/apps/details?id=mount.talent.mtcdev02.udaan) లేదా ఉమాంగ్ యాప్ (https://play.google.com/store/apps/details?id=in.gov.umang.negd.g2c) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడానికి https://consumerhelpline.gov.in/ విజిట్ చేయాలి. ముందుగా వన్-టైమ్‌ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. అందుకు https://consumerhelpline.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి, లాగిన్ లింక్‌పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలను ఎంటర్ చేసి, ఈ-మెయిల్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అలా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ పొందవచ్చు.

నేషనల్ కన్‌స్యూమర్ హెల్ప్‌లైన్ అనేది ఒక ప్రీ-లిటిగేషన్ స్టేజ్ మాత్రమే అని గమనించాలి. ఈ స్టేజ్‌లో సంబంధిత అధికారులు వ్యాపారులను సంప్రదించడం ద్వారా ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు.

వినియోగదారు సంతృప్తి చెందకపోతే, వారు తగిన కన్జ్యూమర్ కమిషన్ ద్వారా పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార సంఘం వెబ్‌సైట్, రాష్ట్ర కమిషన్, జిల్లా కమిషన్ అందుబాటులో ఉంటాయి.

నిబంధనలను ఉల్లంఘించిన దుకాణదారుడిపై జరిమానా విధించవచ్చు లేదా శిక్షించవచ్చు, వినియోగదారుడు అధికంగా వసూలు చేసిన మొత్తానికి నష్టపరిహారం పొందే అవకాశం కూడా ఉంటుంది. MRP అనేది గరిష్ట ధర కానీ స్థిరమైన ధర కాదు. ప్రజలను ఆకర్షించడానికి చిల్లర వ్యాపారులు MRP కంటే తక్కువ ధరకు ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చు.