Tuesday, October 8, 2024
HomeUncategorizedIPS, IFS, రక్షణ రంగాల్లో అమలు చేస్తున్నారా..

IPS, IFS, రక్షణ రంగాల్లో అమలు చేస్తున్నారా..

Date:

తెలంగాణ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సభర్వాల్‌.. తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా దివ్యాంగుల అంశంపై మళ్లీ స్పందించారు. ‘‘సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను ప్రస్తావించినందుకు చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నన్ను విమర్శిస్తున్న హక్కుల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దివ్యాంగుల కోటాను ఐపీఎస్‌, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసులో, రక్షణ వంటి కొన్ని కీలక రంగాల్లో ఇప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదో పరిశీలించండి. ఐఏఎస్‌ కూడా అలాంటిదే అన్నది నా అభిప్రాయం. సమ్మిళిత సమాజంలో జీవించాలన్నది మనందరి కల. కానీ, కొన్ని అంశాల్లో నా మనసులో సున్నితత్వానికి చోటులేదు’’ అని ఆమె పేర్కొన్నారు. స్మిత పోస్టును 11 గంటల వ్యవధిలో 4 లక్షల మందికిపైగా వీక్షించారు. అత్యధికులు విమర్శించారు. 

‘‘తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి పూజా ఖేద్కర్‌ ఐఏఎస్ ఎంపికయ్యారు. మీ సర్టిఫికేట్లను సైతం పరిశీలించాలని ఓ నెటిజన్‌ వ్యాఖ్యానించారు. ఐఏఎస్ రాణించాలంటే శారీరక ధృడత్వం కంటే మానసిక ధృడత్వం కీలకమని.. అంగవైకల్యం ఉన్నా ప్రజాసేవలో తమ ప్రత్యేకత చాటుతున్న సివిల్‌ సర్వెంట్లు ఎంతోమంది ఉన్నారని మరో నెటిజన్‌ అన్నారు. ‘‘వివాదాస్పద అంశాలపై ట్వీట్లతో సమయాన్ని వృథా చేసే బదులు.. తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయండి. ఏసీ గదులను వీడి క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించండి’’ అని మరో నెటిజన్‌ సూచించారు. కొందరు మాత్రం.. ‘‘అంధుడిని కారు డ్రైవరుగా నియమిస్తామా? వైకల్యం ఉన్న వైద్యుడితో శస్త్రచికిత్స చేయించుకుంటామా?’’ అంటూ స్మిత వ్యాఖ్యలను సమర్ధించారు. దివ్యాంగులపై స్మిత చేసిన వ్యాఖ్యలపై బక్క జడ్సన్‌ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.