Sunday, October 6, 2024
HomeUncategorized1978 తర్వాత తెరచుకోనున్న పూరీ రత్న భాండాగారం..

1978 తర్వాత తెరచుకోనున్న పూరీ రత్న భాండాగారం..

Date:

ఒడిశా పూరీలో కొలువైన‌ శ్రీ జగన్నాథ దేవాలయం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిచెందింది. పూరీ జగన్నాథుని రత్న భాండాగారాన్ని జులై 14వ తేదిన తెరవాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ భాండాగారం ఎంతో రహస్యమైన గది. ఇందులో అనేక అమూల్యమైన అభరణాలున్నాయని సమాచారం. ఈ భాండాగారంలోని ఐదు పెట్టెల్లో ఉన్న అమూల్యమైన ఆభరణాలను లెక్కించేందుకే ఈ నెల 14న దీనిని తెరవబోతున్నారు. ఆ సమయంలో అనుసరించవలసిన మార్గదర్శకాలను అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు.

1978 తర్వాత తొలిసారిగా ఈ రత్న భాండాగారాన్ని తెరవబోతున్నారు. అయితే, చాలా సందర్భాల్లో ఈ రత్నభాండాగారాన్ని తెరిచేందుకు ప్రయత్నించినా పాముల భయంతో చాలామంది లోపలకి వెళ్లలేపోయారు. అయితే పురాతన దేవాలయాల్లోని ఖజానాలకు పాములు కాపలా ఉంటాయనే నమ్మకం ఇంకా నెలకొని ఉండడంతో ఇందులో వెళ్లేందుకు చాలామంది భయపడుతున్నారు. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ రత్నాభాండాగారంలో ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. వీటి ధర వెలకట్టలేదని కూడా చాలామంది అంచనా వేస్తున్నారు.

అటువంటి అత్యంత విలువైన ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తడంతో ఈ రత్నాభాండగారాన్ని తెరిచేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4వ తేదిన నిపుణుల బృందం వెళ్లింది. ఆ రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేక నిపుణుల బృందం వెనుదిరిగింది. ఈసారి అధికారులు అన్నీ ప్రణాళికలతో ఈ రహ్యసగదిని తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.