17 నెలల తర్వాత ఇంట్లో టీ తాగుతున్నాను అని మనీష్ సిసోడియా పేర్కొన్నారు. భారతీయులందరికీ రాజ్యాంగం స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించింది. అందరితో పాటు కలిసి ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ భగవంతుడు మనకు ప్రసాదించాడు అంటూ పేర్కొన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ నమోదు చేసిన కేసుల్లో సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం సిసోడియా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అంతకుముందు.. రూ.10 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో, ఇద్దరు ష్యూరిటీ తీసుకొని ఆయనను విడుదల చేయాలని కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. ఈ సందర్భంగా సిసోడియా తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, ప్రతీ సోమవారం, గురువారం ఏజెన్సీల అధికారుల ముందు హాజరుకావాలని ధర్మాసనం కొన్ని షరతులు విధించింది. కాగా, ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో కిందటేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియాను అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన జైలులోనే ఉన్నారు.