Monday, September 23, 2024
HomeUncategorized10 అడుగుల గదికి రూ. 10 నుంచి 15 వేల ఇంటి అద్దె

10 అడుగుల గదికి రూ. 10 నుంచి 15 వేల ఇంటి అద్దె

Date:

చాలా మంది యువతీ, యువ‌కుల తాను క‌లెక్ట‌ర్ కావాల‌ని, పెద్ద పోలీస్ ఆఫీస‌ర్ అవ్వాల‌ని క‌ల‌లుగంటారు. అందుకు గ్రామాల‌ను, అంద‌రిని వ‌దిలి త‌మ ల‌క్ష్యం కోసం దేశ నలుమూల‌ల నుంచి దేశ రాజ‌ధాని ఢిల్లీకి వ‌చ్చే వారు ఉన్నారు. విద్యార్థుల అవ‌కాశాన్ని అలుసుగా తీసుకుంటున్న ఆ ప్రాంతం వారు విప‌రీతంగా అద్దెలు, ఇత‌ర‌త్రా రేట్లు పెంచుతున్నారు. ఢిల్లీలో సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న ఓ విద్యార్థి గది తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కేవలం 10 అడుగుల పొడవు, వెడల్పు కలిగిన గదిలో ఓ విద్యార్థి సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఒక టేబుల్‌, కొన్ని పుస్తకాలు, ఒక కుర్చీ, నడవడానికి కాస్త స్థలం మాత్రమే ఉంది. లోపల ఒకరు ఉంటే మరొకరు కాసేపు ఉండేందుకు చోటు కూడా లేని పరిస్థితి. దుస్తులను కూడా లోపలే ఆరబెట్టుకోవాల్సిన దుస్థితి. ఈ ఇరుకుగదికి యజమానులు రూ.12 నుంచి రూ.15 వేల వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ఏటా అద్దె పెరుగుతూనే ఉంటుంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇలాంటిచోట ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ విద్యార్థులు పరీక్షకు సన్నద్ధం అవుతున్నారు.

దీనికి సంబంధించిన వీడియోను డీఎస్పీ అంజలి కటారియా ఖాతాలో షేర్‌ చేశారు. విద్యార్థుల దుస్థితిపై ఆందోళన వ్యక్తంచేశారు. ”10X10 చిన్న గదికి విద్యార్థులు రూ.వేల రూపాయల చెల్లిస్తున్నారు. ఇంటి నుంచి దూరంగా ఉండాలని మాత్రమే ఢిల్లీకి రావొద్దు. మీ కుటుంబం డబ్బును వృథా చేయకండి. ఆన్‌లైన్‌ వీడియో ద్వారా ప్రిపేర్‌ అవడానికే విద్యార్థులు ఇంత మొత్తం చెల్లిస్తున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం” అని పోస్టు చేశారు. ఇటీవల ఢిల్లీలోని కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి వరద నీరు చేరడంతో ముగ్గురు సివిల్స్‌ విద్యార్థులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సరైన వాతావరణం లేనిచోట తాము ప్రిపేర్‌ అవుతున్నామంటున్న విద్యార్థులు.. ఆ ముగ్గురి మరణాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో కోచింగ్‌ సెంటర్‌ యజమానిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి.