Monday, October 7, 2024
HomeUncategorizedసైనికుల త్యాగాలు, జ్ఞాపకాలు సాహిత్యంలో భాగం కావాలి

సైనికుల త్యాగాలు, జ్ఞాపకాలు సాహిత్యంలో భాగం కావాలి

Date:

దేశ ర‌క్ష‌ణ‌తో పాటు ప్ర‌జ‌ల భ‌ద్ర‌త కోసం అనునిత్యం ప‌నిచేసి ప్రాణ‌త్యాగం చేసిన సైనికుల త్యాగాలు, జ్ఞాప‌కాలు జాన‌ప‌ద సాహిత్యంలో భాగం కావాల‌ని సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. కార్గిల్‌ యుద్ధం 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. గతంలో చేసిన తప్పిదాలను పునరావృతం చేయకూడదన్నారు. కార్గిల్‌ యుద్ధంలో పోరాడిన సైనికులను సీడీఎస్‌ ఈ సందర్భంగా కొనియాడారు.

”యుద్ధం, యుద్ధక్షేత్రం వేగంగా మారుతున్నాయి. సాంకేతికతలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు, భౌగోళిక రాజకీయ పరిణామాలతో యుద్ధం స్వభావం కూడా మారుతోంది. కార్గిల్‌ యుద్ధంతో ఇది నిజంగానే మారింది. సైనికులు చేసిన త్యాగాల జ్ఞాపకాలు మన జానపద సాహిత్యంలో భాగం కావాలి. గతంలో నేర్చుకున్న పాఠాలు మన సైన్యంలో ఇమిడిపోవాలి” అని త్రివిధ దళాల అధిపతి జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. సాయుధ దళాల్లో చేరే యువతలో స్ఫూర్తి నింపడంతోపాటు శౌర్యం, పరాక్రమం వారిలో కొనసాగించేలా కృషి చేయాలన్నారు. యుద్ధం జ్ఞాపకాలను గుర్తుపెట్టుకోవడంతో పాటు దాని పరిణామాలను విశ్లేషించి, భవిష్యత్తు కోసం సరైన పాఠాలు నేర్చుకోవడం ఎంతో ముఖ్యమన్నారు.