Saturday, September 28, 2024
HomeUncategorizedసీబీఐ కార్యాలయంలో కవితను కలిసిన కేటీఆర్

సీబీఐ కార్యాలయంలో కవితను కలిసిన కేటీఆర్

Date:

సిబిఐ కస్టడీలో ఉన్న సోదరి కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఢిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయంలో కలిశారు. కవితన కలిసిన వారిలో కేటీఆర్ తో పాటు కవిత భర్త, న్యాయవాది మోహిత్ రావు ఉన్నారు. కవితను కేటీఆర్ ఎందుకు కలిశారో తెలియరాలేదు. కవితను సీబీఐ అరెస్ట్ చేసిన కేటీఆర్ మొదటిసారి ఆమెను కలిశారు. సీబీఐ ఏం అడిగింది.. ఏం సమాధానాలు చెప్పవు అని కేటీఆర్ కవితను అడిగినట్లు తెలిసింది.

కేసుకు సంబంధించి లీగల్ గా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా వారు చర్చించినట్లు సమాచారం. కవితను సీబీఐ మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుంది. సీబీఐ కస్టడీ ఏప్రిల్ 15తో ముగుస్తుంది. ఆ తర్వాత కవితని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అంతకు ముందు కవితను ఈడీ కూడా విచారించింది. లిక్కర్ స్కామ్ లో గోరంట్ల బుచ్చిబాబు ఇచ్చిన వాంగ్మూలంలో కవిత పేరు చెప్పినట్లు తెలిసింది. బుచ్చిబాబు వాట్సాప్ చాటింగ్ లో కవిత పేరు ఉండడంతో బుచ్చిబాబును ప్రశ్నించారు. దీంతో అతను కవిత పేరు బయట పెట్టినట్లు చెబుతున్నారు.

దీనిపై సీబీఐ కోర్టు ముందు వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే.. హవాలా రూపంలో డబ్బు మళ్లించినట్లు పలు పత్రాలు దొరికాయని సీబీఐ తెలిపింది. రూ.100 కోట్లను తరలించినట్లు పేర్కొంది. కవితకు ఇండో స్పిరిట్ హోల్ సేల్ లైసెన్స్ ​లో భాగం ఉందని వివరించింది. ఇదంతా బుచ్చిబాబు, కవితకు మధ్య జరిగిన ఫోన్ కాల్ ద్వారా బహిర్గతమైందని సీబీఐ స్పష్టం చేసింది. 2021 సెప్టెంబర్ 20న ఢిల్లీలోని హోటల్ తాజ్ మాన్ సింగ్​లో ఫెర్నార్డ్ రికార్డు ఇండియా నిర్వహించిన మీటింగ్​ లో అరబిందో గ్రూప్ ​కు చెందిన శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, సమీర్ మహేంద్ర, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయిన్​ పల్లి పాల్గొన్నారని తెలిపింది. ఈ మీటింగ్ కు సంబంధించిన ఫొటోలు ఫెర్నార్డ్ రికార్డు సంస్థకు చెందిన మనోజ్ రాజ్ మొబైల్ ఫోన్ ​లో లభించాయని పేర్కొంది. అయితే కవిత మాత్రం తాను తప్పు చేయలేదని చెబుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసు విచారణ సంవత్సరానికి పైగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు.