Tuesday, September 24, 2024
HomeUncategorizedసీఏఏపై ఇండియన్ ముస్లిం లీగ్‌ అభ్యంతరం

సీఏఏపై ఇండియన్ ముస్లిం లీగ్‌ అభ్యంతరం

Date:

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంపై కొన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితమైందంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని అమలుకు విరామం ఇవ్వాలంటూ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2019లో కూడా సీఏఏను సవాలు చేస్తూ ఐయూఎంఎల్‌ సుప్రీం మెట్లెక్కింది. నిబంధనలు ఇంకా నోటిఫై చేయకపోవడంతో ఆ చట్టం అమల్లోకి రాదని అప్పట్లో కేంద్రం కోర్టుకు వెల్లడించింది. తాజాగా నిబంధనలు నోటిఫై చేయడంతో.. మళ్లీ ఆ అంశం కోర్టుకు చేరింది. ఆ చట్టం రాజ్యాంగ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 250 పిటిషన్లపై తీర్పు వచ్చేవరకు దాని అమలుపై స్టే విధించాలంటూ తన పిటిషన్‌లో కోరింది.

సీఏఏ చట్టం-2019లోనే పార్లమెంటు ఆమోదం పొందినా.. రాష్ట్రపతి సమ్మతి కూడా లభించినా… విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్త నిరసనల కారణంగా దాని అమలులో జాప్యం జరిగింది. పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పలుమార్లు చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్టే ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు దీనిని తీసుకువచ్చారు. కొందరిపై వివక్ష చూపేలా ఉంటే దీనిని అమలుచేయబోమని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఈ చట్టాన్ని తాము అమలుచేసేది లేదని కేరళ ముఖ్యమంత్రి విజయన్‌లు తెగేసి చెప్పారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఇదేతరహా ప్రకటన చేశారు.