Friday, September 20, 2024
HomeUncategorizedసీఎం అరెస్ట్‌ కావడం దేశంలోనే తొలిసారి

సీఎం అరెస్ట్‌ కావడం దేశంలోనే తొలిసారి

Date:

మనీ లాండరింగ్‌ కేసులో ఇటీవల అరెస్టయిన జార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎం పార్టీ నాయకుడు హేమంత్‌ సోరెన్‌ సోమవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించారు. గత జనవరి 31న రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తనను అరెస్ట్‌ చేశారని, అది ఒకటి చీకటి అధ్యాయమని అన్నారు. ఒక సీఎం అరెస్ట్‌ కావడం దేశంలో ఇదే తొలిసారని, తన అరెస్ట్‌ వెనుక రాజ్‌భవన్‌ ప్రమేయం ఉన్నదని గట్టిగా నమ్ముతున్నానని చెప్పారు. తాను నేరం చేసినట్లు రుజువైతే రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు.

చంపాయ్‌ సోరెన్‌ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష నేపథ్యంలో రాంచి కోర్టు అనుమతితో హేమంత్‌ సోరెన్‌ సోమవారం అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘జనవరి 31న నన్ను అరెస్ట్‌ చేశారు. అది నా జీవితంలో ఒక చీకటి అధ్యాయం. ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఈ అరెస్ట్‌ వెనుక రాజ్‌భవన్‌ ప్రమేయం ఉందని నేను గట్టి నమ్ముతున్నా. తాను భూ కుంభకోణానికి పాల్పడినట్లు రుజువైతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా’ అన్నారు.

మనీ లాండరింగ్‌ కేసులో గత నెల 31న రాత్రి ఈడీ అరెస్ట్‌ చేసిన అనంతరం హేమంత్‌ సోరెన్‌ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జేఎంఎం పార్టీ ఉపాధ్యక్షుడు చంపాయ్‌ సోరెన్‌ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ క్రమంలో 10 రోజుల్లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌.. సీఎం చంపాయ్‌ సోరెన్‌కు సూచించారు. ఈ నేపథ్యంలో తన ప్రభుత్వంలోని మంత్రులతో చంపాయ్‌ సోరెన్‌ క్యాబినెట్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 5, 6 తేదీల్లో జార్ఖండ్ అసెంబ్లీ స్పెషల్‌ సెషన్‌ నిర్వహించాలని, 5న బలపరీక్ష జరపాలని నిర్ణయించారు.