Sunday, October 6, 2024
HomeUncategorizedసికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు

సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు

Date:

గోవా వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడగామా(గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనుంది. ఇప్పటివరకు వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి గుంతకల్‌ చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. ఇది కాకుండా కాచిగూడ – యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్ళే 4 కోచ్‌లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ – గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు. ఇప్పుడు సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించడంతో ప్రధాని మోదీ, రైల్వే శాఖమంత్రి అశ్వినీవైష్ణవ్‌లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్‌ చుట్టపక్కల ప్రాంతాల నుంచి గోవా వెళ్లే పర్యటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నూతన సర్వీసు అందుబాటులోకి రావడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్‌-గోవా బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుందని రైల్వేశాఖ వెల్లడించింది.