Tuesday, September 24, 2024
HomeUncategorizedసిఎఎను కేరళలో అమలు చేయం

సిఎఎను కేరళలో అమలు చేయం

Date:

కేంద్రం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టంను కేరళలో అమలు చేయమని కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని మత విభజన చట్టంగా అభివర్ణించిన ఆయన.. తమ రాష్ట్రంలో దీనిని అమలు చేయబోమని తేల్చి చెప్పారు. ముస్లిం మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే పౌరసత్వ సవరణ చట్టాన్ని కేరళలో అమలు చేయబోమని చెప్పిన విజయన్ దక్షిణాది రాష్ట్రంలలో కూడా ఇది అమలులోకి రాదన్నారు. ఈ మత విభజన చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ అంతా ఏకతాటిపై నిలబడుతుందని సీఎం పినరయి విజయన్ ధీమా వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన కొద్దిసేపటికే సీఎం పినరయి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరోవైపు దేశంలో నేటి నుంచి సిఎఎను అమల్లోకి తేవడాన్ని స్వాగతిస్తున్నామని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నామని అయోధ్య రామమందిర ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ అన్నారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం-2019 అమల్లోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 2019 డిసెంబర్‌లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం2019 పార్లమెంటు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. కానీ పూర్తి నిబంధనలపై సందిగ్ధత నెలకొనడంతో ఈ చట్టం అమలు కార్యరూపం దాల్చలేదు. లోక్‌సభ ఎన్నికల ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల పలుమార్లు స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్‌ జారీ అయింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌కు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం పౌరసత్వ సవరణ చట్టం ఉద్దేశం.