Tuesday, September 24, 2024
HomeUncategorizedశరీరంలో కాల్షియం తగ్గుతే ప్రమాదమే

శరీరంలో కాల్షియం తగ్గుతే ప్రమాదమే

Date:

మనిషి అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని రకాల పోషకాలు అందే ఆహారం తీసుకోవాలి. శరీరానికి సరియైన పోషకాహారం అందకుంటే అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా కాల్షియం లభించే ఆహారాలు డైలీ డైట్‌లో కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇది శరీరానికి చాలా అవసరమైన ఖనిజం. ఇది లోపిస్తే ఎముకలు బలహీనంగా తయారవుతాయి. చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోవచ్చు. కండరాల కదలిక, నరాల మధ్య కమ్యూనికేషన్, రక్తం గడ్డకట్టడానికి కూడా కాల్షియం అవసరం. శరీరంలో తగినంత కాల్షియం లేనప్పుడు, హైపోకాల్సెమియా అనే పరిస్థితి తలెత్తుతుంది. శరీరంలో చాలా తక్కువ కాల్షియం స్థాయిలు ఉంటే ఎముకల బలహీనత, కండరాల తిమ్మిరి, గందరగోళం వంటి సమస్యలకు దారి తీస్తుంది.

బలహీనంగా ఎముకలు

శరీరంలోని కాల్షియం ఎక్కువ భాగం దంతాలు, ఎముకల్లోనే స్టోర్ అవుతుంది. ఇది రక్తంలో కూడా ఉంటుంది. కాల్షియం గుండె, కండరాలు, నరాలు సరిగ్గా పని చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారం నుంచి తగినంత కాల్షియం పొందకపోతే, శరీరం దానిని ఎముకల నుంచి తీసుకుంటుంది. దీనివల్ల ఎముకలు బలహీనంగా తయారవుతాయి. బోలు ఎముకల వ్యాధి కూడా వచ్చే ప్రమాదం ఉంది.

కాల్షియం లోపం

అయితే థైరాయిడ్ సర్జరీ చేయించుకున్న వారు, కొన్ని మందులు తీసుకునేవారు, జన్యుపరమైన పరిస్థితులు, తక్కువ మెగ్నీషియం, ప్యాంక్రియాటైటిస్ లేదా డిజార్జ్ సిండ్రోమ్ ఉన్నవారు కాల్షియం లోపంతో బాధపడవచ్చు. పెరుగుతున్న పిల్లలు, మహిళలు, వృద్ధుల్లో కూడా కాల్షియం లోపించడం తరచుగా కనిపిస్తుంది. మూత్రపిండ సమస్యలు ఉన్న వ్యక్తులు కాల్షియంతో ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే వారి రక్తంలో చాలా ఎక్కువ భాస్వరం ఉంటుంది, ఇది కాల్షియం స్థాయిలను గందరగోళానికి గురి చేస్తుంది. మన శరీరం కాల్షియంను గ్రహించడానికి విటమిన్ డి అవసరం. అది లేకుండా కాల్షియం లభించే ఆహారాలు తిన్నా, శరీరం దానిని సరిగ్గా ఉపయోగించదు.

లక్షణాలు

తేలికపాటి హైపోకాల్సెమియా పరిస్థితి స్పష్టమైన లక్షణాలను కలిగించకపోవచ్చు, కానీ కండరాల తిమ్మిరి, చర్మం పొడిబారడం, గోళ్లు పెళుసుగా మారడం, జుట్టులో మార్పులు, గందరగోళం, మానసిక కల్లోలం, జలదరింపు, కండరాల నొప్పులు, మూర్ఛ, గుండె సమస్యలు కనిపిస్తే అది హైపోకాల్సెమియా అని అర్థం చేసుకోవచ్చు.

ఈ ఆహారం తీసుకోవాలి

ఈ లోపంతో బాధపడే వారికి వైద్యులు సాధారణంగా కాల్షియం మాత్రలు సూచిస్తారు. ఈ మాత్రలకు బదులుగా కాల్షియం అధికంగా ఉండే డెయిరీ ప్రొడక్ట్స్, నారింజ, పాలకూర వంటి ఆహారాలను తినవచ్చు. బీన్స్, బఠానీలు, బాదం వంటి గింజలు, చేపలు, సోయా ఉత్పత్తుల నుంచి కూడా ఈ ఖనిజం లభిస్తుంది. అతి అనర్థాలకు మూలం అంటారు కాబట్టి శరీరంలో కాల్షియం ఎక్కువ పెరిగిపోకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎక్కువ కాలం కాల్షియం లోపంతో బాధపడుతున్న వారికి విటమిన్ డి మాత్రలు లేదా ప్రత్యేక హార్మోన్ షాట్ అవసరం కావచ్చు. తీవ్రమైన సందర్భాల్లో ఆసుపత్రిలో ఐవి ద్వారా కాల్షియం పొందవచ్చు. ఆరోగ్యానికి కాల్షియం స్థాయిలను సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఆహారంలో కాల్షియంను తప్పకుండా చేర్చుకోవాలి. హైపోకాల్సెమియా గురించి ఏవైనా లక్షణాలు లేదా ఆందోళనలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.